Rains In Telangana: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో తీరాన్ని ధాటింది మొంథా తుఫాను. దీని కారణంగా మంగళవారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌లో అర్థరాత్రి నుంచి వర్షం కుమ్మేస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకుంటోంది.
మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
మొంథా తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది. అర్థరాత్రి నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం అంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అర్థరాత్రి నుంచి హైదరాబాద్ సిటీలో గ్యాప్ ఇచ్చి మరీ వర్షం పడుతోంది. వాటిలో కుత్బుల్లాపూర్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా, మెహిదీపట్నం వంటి ప్రాంతాలు ఉన్నాయి.
అటు అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, లింగంపల్లి, మాదాపూర్, హైటెక్‌సీటీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్నింగ్ డ్యూటీకి వెళ్లేవారు సరైన సమయానికి బస్సులు రాక అవస్థలు పడ్డారు.
అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం
రాబోయే రెండు లేదా మూడు గంటలు గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హనుమకొండ, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఆపై ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ALSO READ: మంత్రి జూపల్లిని టార్గెట్ చేసిందెవరు?
50 నుంచి 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రి నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మంగళవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ సిటీలోని కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. తెలంగాణలోని వికారాబాద్ లో అత్యధికంగా 42 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.నాగర్ కర్నూల్ జిల్లాలో 34.3 మి.మీ, నల్గొండ జిల్లా – 33.5 మి.మీ, సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచనూరులో 31.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాన్ కారణంగా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసిన జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) పది గేట్లు, హిమాయత్ సాగర్ నాలుగేట్లు ఎత్తి దిగువకు నీటిని కిందికి వదిలారు. మంచిరేవుల కల్వర్టుపైనుండి వరద నీరు పారడంతో కొంతసేపు రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది.
తుఫాన్ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ రెట్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పిల్లలను బయటకు పంపించవద్దని కోరారు.