డెలివరీ బాయ్స్.. ఇంట్లోనుంచి మనం కాలు బయటపెట్టకుండా నిత్యావసరాలని, ఇతర వస్తువుల్ని మన ఇంటికే తెచ్చి ఇచ్చే వ్యక్తి. వారేమీ ఉచిత సేవ చేయట్లేదనుకోండి. ఆయా వస్తువులకు మనం చెల్లించే ధరలోనే వారి సేవకు కూడా ఖరీదు కడుతున్నాం. అంత మాత్రాన వారిని మనకింద పనిచేసే వ్యక్తులు అనుకోలేం. కానీ కొంతమంది మూర్ఖులు మాత్రం డెలివరీ బాయ్స్ ని మరీ నీఛంగా చూస్తున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా విశాఖలో ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ కి చేదు అనుభవం ఎదురైంది. కస్టమర్ ని అన్నా అని పిలవడమే అతను చేసిన పాపం. తనను సార్ అని పిలవాలంటూ ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చేశాడు. బట్టలు విప్పించి విచక్షణా రహితంగా కొట్టాడు. మెట్లపై పరిగెత్తించి మరీ కొట్టాడట. ఆ అవమాన భారంతా అనిల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. చివరకు పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అనిల్ పై దాడి చేసిన ప్రసాద్ పై కేసు పెట్టారు. కోర్టు ప్రసాద్ కి రిమాండ్ విధించింది. డెలివరీ బాయ్ పై జులం చూపించిన ప్రసాద్ ఇప్పుడు విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నాడు.
ఎందుకీ వివక్ష..?
డెలివరీ బాయ్స్ అంటే ఎవరు..? మనలాంటి మనుషులే కదా. సరైన ఉపాధి లేక, ఉద్యోగం ఉన్నా జీతం సరిపోక చాలామంది డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తుతుంటారు. పెద్ద పెద్ద బ్యాగ్ లు వేసుకుని, ఉదయాన్నే డ్యూటీ ఎక్కుతారు. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి డెలివరీ అందిస్తారు. మహా అయితే ఆ డెలివరీ బాయ్ కి సంతోషంగా థ్యాంక్స్ చెబితే చాలు, ఆ రోజంతా వారు హ్యాపీగా తమ పని చేసుకుంటారు. ఇంకొందరుంటారు. డెలివరీ బాయ్స్ పై రుసరుసలాడతారు. ఇంట్లో తమ కుటుంబ సభ్యులపై చూపించాల్సిన కోపాన్ని డెలివరీ బాయ్స్ పై చూపిస్తుంటారు. హీనంగా చూస్తారు, చీదరించుకుంటారు, డెలివరీ తీసుకున్నాక కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. అలాంటి వారిలో ఇంకాస్త అతిగా ప్రవర్తించిన వ్యక్తే విశాఖ ప్రసాద్. సార్ అని పిలవలేదని, డెలివరీ బాయ్ అనిల్ పై ఏకంగా దాడి చేశాడు.
అంత ఈజీ కాదు..
డెలివరీ బాయ్స్ పని అంటే అంత ఈజీ కాదు. అంతా ఫోన్ లోనే అయిపోతుంది, బండిలో రయ్యిమంటూ వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్తుంటారు, జీతం బాగానే ఉంటుంది అనే అపోహ అందరిలోనూ ఉంది. కానీ వారి పని గురించి నిజాలు తెలిస్తే కచ్చితంగా వారిపై జాలేస్తుంది. పల్లెటూళ్లలో పర్లేదు కానీ, పట్టణాల్లో వారి జీవితం మరీ దుర్భరం. చాలామంది కస్టమర్లు డెలివరీ బాయ్స్ ని కనీసం మనుషుల్లా కూడా జమ కట్టరు. కొన్ని అపార్ట్ మెంట్లలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కడానికి లేదంటూ కొత్త రూల్స్ పెడతారు. ఇంకొన్ని చోట్ల సెక్యూరిటీ వాళ్లు, డెలివరీ బాయ్స్ ని కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వరు.
కష్టపడి 10, 20 నిమిషాలపాటు అడ్రస్ వెదుక్కుని మరీ డెలివరీ ఇస్తే.. కస్టమర్లు తమ పార్శిల్ తీసుకుని మొహంపైనే డోర్ వేస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే తీసుకువెళ్లిన వస్తువులను గుమ్మం ముందు పెట్టి వెళ్లిపోవాలని ఫోన్లోనే ఆర్డర్ పాస్ చేస్తారు. కొన్ని అపార్ట్ మెంట్లలో డెలివరీ బాయ్ అంటేనే దొంగలా ట్రీట్ చేస్తారు. కొన్నిచోట్ల కుక్కల్ని వదిలిపెట్టి భయపడేలాగా చేస్తారు. ఇక స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసేవారి కష్టాలు ఇంకా ఎక్కువ. హోటళ్ల వాళ్లు కూడా వారిని దారుణంగా ట్రీట్ చేస్తారు. పార్శిల్ రెడీ అయ్యే వరకు వారిని హోటల్ లోకి రానివ్వరు, బయట ఎండలోనే నిలబడమని చెబుతారు. స్విగ్గీ, జొమాటో వాళ్లిచ్చి టీషర్ట్ లు తీసేసి లోపలికి వెళ్తేనే కస్టమర్ లాగా ట్రీట్ చేస్తారు.
ఉన్మాదంతో..
స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ పుట్టు పూర్వోత్తరాలు కూడా ఆరా తీసేవారు ఉంటారు. ఫలానా కులం, మతం వారు తమకు డెలివరీ ఇవ్వడానికి వస్తే తాము తీసుకోబోమంటూ కొందరు కండిషన్లు కూడా పెట్టేవారు. దీంతో ఆమధ్య ఓ కంపెనీ వెజ్, నాన్ వెజ్ డెలివరీస్ కోసం తమ ఉద్యోగుల్ని రెండుగా విభజించింది. వారికి వేర్వేరు రంగుల టీ షర్ట్ లు ఇచ్చింది. ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్దుకుంది. ఇటీవల కొంతమంది ఉన్మాదులు.. డెలివరీ బాయ్స్ ఇచ్చిన వస్తువుల మీద పసుపు నీళ్లు చల్లి మరీ తీసుకుంటున్నారట. ఆ శుద్ధి కార్యక్రమం ఏదో డెలివరీ బాయ్స్ వెళ్లాక చేసుకున్నా బాగుండేది. వారి కళ్లముందే ఆ వస్తువుల్ని కిందపెట్టి పసుపు నీళ్లు చల్లి, వాటిల్ని పవిత్రంగా మార్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత చేతితో తాకుతున్నారట. ఇలాంటి నీఛమైన సంస్కృతి మారాలని డెలివరీ బాయ్స్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మా తప్పేంటి..?
కుటుంబాల కోసం మేం కూడా కష్టపడుతున్నాం, మమ్మల్ని ఎందుకు ఇంత హీనంగా చూడాలి అంటూ డెలివరీ బాయ్స్ సంఘాలకు చెందిన కొంతమంది సూటిగా ప్రశ్నిస్తున్నారు. విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ పై జరిగిన దాడి విషయంలో కూడా అతడికి అనుకూలంగా యూనియన్ ఆందోళన చేపట్టడంతోనే పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. తమని ప్రత్యేకంగా గౌరవించకపోయినా పర్లేదు, కనీసం మనుషులుగా గుర్తించాలని, చులకనగా చూడొద్దని డెలివరీ బాయ్స్ కోరుతున్నారు. వారి డిమాండ్ లో తప్పేం లేదు, మారాల్సిందల్లా.. కొంతమంది కస్టమర్ల మనస్తత్వమే.