Minister Bhatti Vs KTR: తెలంగాణ అసెంబ్లీని 30 శాతం కమీషన్ల వ్యవహారం కుదిపేసింది. మైక్ దొరికిందని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ విషయంలో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించడానికి తాము ఇబ్బంది పడుతుంటే, కమీషన్లు అంటూ మాట్లాడడం సరికాదన్నారు.
బుధవారం తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభ్యుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బడ్జెట్ ప్రసంగంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఈలోగా కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. సభలో మంత్రులు హందాగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రశ్నిస్తామన్నారు. 30 శాతం కమీషన్లు అని వారి ఎమ్మెల్యేలు అంటున్నారని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది.
ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు భట్టి విక్రమార్క. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు అధికార కాంగ్రెస్-అటు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు మంత్రి భట్టి విక్రమార్క. లేదంటే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు మంత్రి. మైకు ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదన్నారు.
ALSO READ: రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్‌లైన్స్
కేటీఆర్ గౌరవంగా మాట్లాడతారని ఊహించామని, ఆయన మాటలు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రూ.40 వేల కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను పెండింగ్ లో పెట్టారని అన్నారు. వాటిని చెల్లించడానికి తాము నానా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. చివరకు ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
అసెంబ్లీలో కేటీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్
ప్రభుత్వం 30% కమిషన్లు తీసుకున్నట్లు కేటీఆర్ నిరూపించాలి
లేదంటే సభకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
రూ.40 వేల కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను పెండింగ్ లో పెట్టింది మీరు
వాటిని చెల్లించడానికి మేము నానా ఇబ్బంది… pic.twitter.com/XDNhyYzqTP
— BIG TV Breaking News (@bigtvtelugu) March 26, 2025