kurnool Diamond: సమ్మర్ పోయి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏపీలో వజ్రాల వేట మొదలవుతుంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం ఎక్కువగా వేట సాగుతోంది. తాజాగా ఓ రైతుకు తన పొలంలో అరుదైన వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని రూ.30 లక్షలకు అమ్మినట్టు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాల్లో కొన్నిరోజులుగా వజ్రాల వేట కొనసాగుతోంది. ముఖ్యంగా మద్దికెర, తుగ్గలి మండలాల్లోని వివిధ గ్రామాల్లో వజ్రాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో దొరికే వజ్రాలకు మార్కెట్లో మాంచి డిమాండ్ ఉండడంతో రైతులు అటువైపు దృష్టిపెట్టారు. ఆ ప్రాంతంలో చాలామంది రైతులు కూలీలను పెట్టించి మరీ వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు.
ఒక వజ్రం దొరికితే తమ కష్టాలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనని భావిస్తున్నారు. నార్మల్‌గా వజ్రాల కోసం చాలా ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తుంటారు. కొందరికి ఎంత లోతుల్లో తవ్వినా వజ్రాలు లభించవు. కర్నూలు జిల్లాలో మాత్రం ఓపెన్ భూముల్లో వజ్రాలు లభిస్తాయి. అందుకే వేసవి సీజన్ అయిపోగానే చినుకులు పడినప్పుడు భూదేవి తమను కరుణిస్తుందని ఆశగా ఎదురు చూస్తారు కొందరు రైతులు.
తాజాగా మద్దికెర మండలం పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయం సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి తన పొలంలో వెతుకుతుండగా ఊహించని వజ్రం లభించింది. దాదాపు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం అని తెలుస్తోంది. వజ్రాన్ని ఆ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి దానిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ALSO READ: వంశీ కోసం నాని వీరంగం, క్షమాపణ చెబుతాడా?
బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ దాదాపు రూ.60 లక్షల వరకు ఉండవచ్చని ఆ వ్యాపారి అంచనా వేస్తున్నాడు. స్థానికంగా దొరికిన వజ్రంపై చర్చ జరుగుతోంది. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారుల కు సమాచారం అందింది. ఇంకోవైపు పెరవలికి చెందిన ఓ రైతుకు తన పొలంలో వెతుకుతుండగా చిన్నపాటి వజ్రం దొరికింది. దాన్ని లక్షన్నర అమ్మినట్టు మరో వ్యాపారి మాట.
ఆ వజ్రాల కోసం దూర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో కూడా ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా దాన్ని రూ.1 .3 లక్షలకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురం, బళ్లారి, కర్నూలు ప్రాంతాల నుంచి ప్రజలు వజ్రాల వేటలో నిమగ్నమవుతారు. వ్యాపారులు వారికి వసతి కల్పిస్తున్నారు.
వారంలో వ్యవధిలో విలువైన వజ్రాలు దొరకడంతో ఆ ప్రాంత రైతుల ఆనందం అంతా ఇంతాకాదు. వజ్రాలు వెతకడానికి వచ్చేవాళ్లకు అది నిజంగా కాదో తెలియదు. తెల్లగా ఉండే రాయికి మధ్యలో మెరిసినట్టు కనిపిస్తే అది వజ్రం కింద గుర్తిస్తారు. వ్యాపారులు వాటికి రంగు, నాణ్యత బట్టి ధర నిర్థారిస్తారు. కొనుగోలు వ్యవహారం అంతా రహస్యంగా జరుగుతుంది. ఒక్కోసారి ధర నచ్చకపోతే బహిరంగ వేలం వేస్తారు. వీటి గురించి సమాచారం బయటకు రాదు. అంతా లోలోపల జరిగిపోతుంది.