రెడ్ బుక్ కి పోటీగా డిజిటల్ బుక్ పేరుతో హడావిడి మొదలు పెట్టింది వైసీపీ. ఈరోజు డిజిటల్ బుక్ ని వైఎస్ జగన్ లాంఛనంగా లాంచ్ చేశారు. లాంచింగ్ రోజే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తల కోసం ఈ బుక్ లాంచ్ చేసినట్టు తెలిపారాయన. ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఇందులో నమోదు చేయొచ్చని చెప్పారు. వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుందని, ఓటీపీ నమోదు చేసిన తర్వాత ముందుగా తమకు జరిగిన అన్యాయం వివరాలు నమోదు చేయాలని, ఆ తర్వాత ఫొటో లేదా ఇతర ఆధారాలు నమోదు చేయాలని చెప్పారు. రెండో పద్ధతిలో ఐవీఆర్ఎస్ ద్వారా 040-49171718 నెంబర్ కి ఫోన్ చేసి తమ ఫిర్యాదుని నమోదు చేయొచ్చని వివరించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ బుక్ లోని వివరాలుపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు జగన్.
పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు.. డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైయస్ఆర్ సీపీ
ఈరోజు వైయస్ జగన్ గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ ప్రారంభం
Today, the Digital Book was launched by YSRCP Chief Shri @ysjagan.
Link 🔗👇🏻https://t.co/zJyelqwmsq#YSJagan pic.twitter.com/tE56MexDPg
— YSR Congress Party (@YSRCParty) September 24, 2025
సప్త సముద్రాల అవతల ఉన్నా..
డిజిటల్ బుక్ లో పేరు ఎక్కితే వారి సంగతి తేలుస్తామని హెచ్చరిస్తూనే జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సప్త సముద్రాల అవతల దాగి ఉన్నా వారిని తీసుకొస్తామని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. వారి రిటైర్ అయిపోయినా సరే వదిలేది లేదన్నారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినట్టు ఒక్కసారి డిజిటల్ బుక్ యాప్ లో పేరు నమోదైతే వారికి సినిమా చూపిస్తామంటున్నారు.
రెడ్ బుక్ కి ధీటుగా డిజిటల్ బుక్ ని ప్రవేశపెట్టిన వైసీపీ అధినేత జగన్
అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్ తెచ్చామన్న జగన్
కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డిజిటల్ బుక్ లో ఎలా నమోదు చేసుకోవాలో వివరించిన జగన్ pic.twitter.com/fjk4i4bf63
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2025
మరి రెడ్ బుక్ ని తట్టుకోగలరా..?
డిజిటల్ బుక్ లో పేరు నమోదైన వారికి జగన్ సినిమా చూపిస్తారు సరే, అదెప్పుడో మూడున్నరేళ్ల తర్వాత. మరి అప్పటి వరకు రెడ్ బుక్ సైలెంట్ గా ఉంటుందా? ఉండకూడదనేదే జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. డిజిటల్ బుక్ పేరిట కూటమిని రెచ్చగొట్టేందుకే జగన్ ఈ ప్లాన్ వేశారని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ ఆధిపత్య పోరులో నలిగిపోయేది సామాన్య కార్యకర్తలేనని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ డేంజర్ గేమ్ స్టార్ట్ చేశారని, కార్యకర్తల్ని, నేతల్ని రెచ్చగొడుతున్నారని, డిజిటల్ బుక్ పేరుతో ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ నిజంగానే రెడ్ బుక్ విజృంభిస్తే వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇప్పుడే ఇబ్బందులు మొదలవుతాయని అంటున్నారు.
మరో మూడున్నరేళ్లు కూటమి అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపెవరిదో ఎవరికీ తెలియదు. కానీ జగన్ మాత్రం ఇప్పుడే కలలు కంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మూడున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేస్తామని, అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఇప్పట్నుంచే ప్రగల్భాలు పలుకుతున్నారని కౌంటర్లిస్తున్నాయి. గతేడాది ఎన్నికల సమయంలో కూడా వైనాట్ 175 అన్న జగన్ బొక్కబోర్లా పడ్డారని, ఇప్పుడు ప్రత్యర్థులకు సినిమా చూపిస్తానంటున్నా ఆయన తనతోపాటు అందర్నీ ఇరుకున పెట్టబోతున్నారని చెబుతున్నారు. డిజిటల్ బుక్ పేరుతో ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్న జగన్, వారిని అకారణంగా రెచ్చగొట్టి, వైసీపీ శ్రేణుల్ని అయోమయంలో పడేసే ప్రమాదం ఉందంటున్నారు.
ప్రతీకార రాజకీయాలను జనం మెచ్చుకుంటారా?
రెడ్ బుక్ అయినా, డిజిటల్ బుక్ అయినా ప్రతీకార రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ మెచ్చుకోరు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాన్ని అణచివేస్తామంటే కుదరని పని. అలా అణచివేయాలని ప్రయత్నించడం వల్లే 2024లో జగన్ ఘోరంగా ఓటమిని చవిచూశారు. 2019-24 మధ్యలో ప్రతిపక్ష నేతలపై దాడులు, స్థానిక ఎన్నికల సందర్భంగా దౌర్జన్యాలు చూసి ప్రజలు సహించలేక కూటమికి పట్టం కట్టారని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కూడా జగన్ అలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తామంటే ప్రజలు ఆయన్ను మరింత దూరం పెడతారని హెచ్చరిస్తున్నారు.