Duvvada Vani: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన పొలిటికల్ కెరీర్‌కి తానే చెక్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. భార్యపిల్లలను గాలికొదిలేసి లేటు వయస్సులో దివ్వెల మాధురితో కొత్త ప్రేమాయణం మొదలుపెట్టి నవ్వుల పాలవుతున్నారు. ఆ క్రమంలో టెక్కలి నియోజకవర్గంలో పొలిటికల్‌గా.. ఉనికి చాటుకోలేకపోతున్న తన భర్త ప్లేస్‌ని రీ ప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ మండల జడ్పీటీసీ ఆయన సతీమణి దువ్వాడ వాణి. తన భర్త పేరెత్తితే తానే గుర్తు రావాలి అనేలా యాక్టివ్ అవుతున్నారు. టెక్కలి ఇన్చార్జ్ పదవి దక్కించుకోవడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆశీస్సుల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అసలు ఆమె లెక్కలేంటి?
వైరల్ అవుతున్న దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను రీల్స్
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసిపి అంటే నిన్న మొన్నటి వరకు గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతోంది. దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్న దువ్వాడ శ్రీను వ్యవహారం సోషల్ మీడియాలో మరీ వైరల్ అవుతూ పార్టీకి అప్రతిష్టగా మారడంతో ఆయన్ని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. 2014 ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీను.. టీడీపీ దిగ్గజం అచ్చెన్నాయుడుకి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. 2024 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసీ మరీ దారుణంగా పరాజయం పాలయ్యారు.
టెక్కలి నుంచి పోటీ చేసే యోచనలో దువ్వాడ వాణి
ఆ క్రమంలో దువ్వాడ శ్రీను వైసీపీ నుంచి సస్పెండ్ అవ్వడంతో టెక్కలి వైసీపీలో పాగా వెయ్యడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇదే అదనుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య టెక్కలి జడ్పీటీసీ సభ్యరాలు దువ్వాడ వాణి ఫుల్ యాక్టివ్ అయ్యారు. దివ్వెల వాణి వ్యవహారంతో ఇప్పటికే ఆమె భర్తకు పూర్తిగా దూరమయ్యారు. ఇక తన పొలిటికల్ కెరీర్ చక్కపెట్టుకునే పనిలో పడిన ఆమె అధికార పార్టీపై విమర్శలు చేస్తూ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలా అయినా టెక్కలి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో వాణి ఉన్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
టెక్కలిలో యాక్టివ్ అవుతున్న దువ్వాడ వాణి
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా వాణి కొనసాగారు. అయితే చివరి నిముషంలో దువ్వాడ శ్రీను టికెట్ దక్కించుకుని పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన పేరడ తిలక్‌ను అధిష్టానం ఇన్చార్జిగా నియమించింది. కుటుంబ తగాదాలతో వాణి కూడా కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. చాలావరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కారణాలు ఏమైనాప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ వైసిపి నుంచి సస్పెండ్ అయిన తర్వాత స్లో స్లోగా వాణి నియోజకవర్గంలో కీ రోల్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దువ్వెల మాధురి తో కలిసి శ్రీనివాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే… వాణి మాత్రం నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు.
దువ్వాడ వాణి చేసిన కామెంట్స్ జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారాయి
రీసెంట్‌గా జరిగిన జడ్పీ ఆఫీసులోని సర్వసభ్య సమావేశంలో దువ్వాడ వాణి చేసిన కామెంట్స్ జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారాయి. శానిటైజేషన్ పైన జరిగిన చర్చలో టెక్కలి పట్టణం ప్రస్తావన తీసుకొచ్చారామే. మంత్రి సొంత నియోజకవర్గంలో శానిటైజేషన్ చాలా దారుణంగా ఉందని ఆరోపించారు. పరిస్థితి మారకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు వైసిపి హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని గట్టిగా వాదిస్తూ అధిష్టానం దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేశారు.
పేరాడ తిలక్‌కు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు
తాజాగా జరిగిన జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా వాణి తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి ఓ ఐదు నిమిషాలు ఆయనతో కలిసి కీలకమైన అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. ఎన్నికల నాటికి ఆయన్ని కాదని అధిష్టానం తన వైపు చూడాలంటే తనదైన మార్క్ చూపించాలని వాణి భావిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది.