రాజకీయాల్లో వైరి వర్గాలను సామాజిక వర్గాల వారీగా టార్గెట్ చేయడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ ని జగన్ కూడా పక్కాగా ఫాలో అవుతుంటారు. టీడీపీలో ఉన్న కమ్మ సామాజికవ ర్గం నేతల్ని వైసీపీలో ఉన్న అదే సామాజిక వర్గంతో తిట్టిస్తుంటారు. ఇక కాపు సామాజిక వర్గాన్ని కూడా అలాగా టార్గెట్ చేస్తుంటారు జగన్. ఈ కోవలో పవన్ ని తిట్టేందుకు ఆయన ప్రత్యేకంగా పేర్ని నానీని పురమాయించారని అంటుంటారు. 2024 ఎన్నికల సమయంలో కూడా ఈ టాస్క్ ని కంప్లీట్ చేశారు పేర్ని నాని. అప్పట్లో పవన్ చెప్పు చూపించడం, పేర్ని నాని ప్రెస్ మీట్ లో రెండు చెప్పులు చూపించడం, వారిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ దూకుడు కాస్త తగ్గినా.. కూటమి పాలన ఏడాది పూర్తి కావడంతో మళ్లీ వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా పేర్ని నాని దూకుడు పెంచారు. నేరుగా డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 2029లో కూడా వైసీపీని అధికారంలోకి రానీయబోమంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పేర్ని కౌంటర్ ఇచ్చారు.
విమర్శల దాడి..
గతంలో పవన్ అసలు ఎన్నికల్లో గెలవలేరని అనేవారు వైసీపీ నేతలు. పేర్ని నాని కూడా అలాంటి విమర్శలే చేశారు. ఎన్నికల్లో ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వైసీపీ నేతలు మాట మార్చారు. ఎన్నికల్లో జనసేన సొంతగా గెలవలేదంటున్నారు. ఆయన టీడీపీ కోసమే పార్టీ పెట్టారని విమర్శిస్తున్నారు. జనసేన టెంట్ హౌస్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు పేర్ని నాని. టీడీపీకి అద్దెకు ఇవ్వడం కోసమే పవన్ పార్టీ పెట్టారన్నారు. రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు నాని.
అడ్డుకోగలవా..?
2029లో అధికారంలోకి వచ్చాక కూటమి నేతల సంగతి చూస్తామంటూ ఇటీవల వైసీపీ నేతలు వార్నింగ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలకు డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనలో బదులు చెప్పారు. అసలు 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే కదా అని అన్నారాయన. వారు ఎలా అధికారంలోకి వస్తారో తానూ చూస్తానన్నారు. పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. 2019లో కూడా పవన్ ఇలానే మాట్లాడారని, అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని లాజిక్ తీశారు. ఈసారి కూడా అదే జరుగుతుందని, ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది ప్రజలేనని అన్నారు నాని.
2024 ఎన్నికల్లో కూటమి ఫెయిల్ అవుతుందని అంచనా వేసింది టీడీపీ. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వల్ల వైసీపీకే లాభమని చాలా సందర్భాల్లో అన్నారు జగన్. అయితే ఎన్నికల ఫలితం వైసీపీకి తీవ్ర నిరాశ కలిగించింది. ఎన్నికల తర్వాత కూటమిలో గొడవలు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే పవన్ ని టార్గెట్ చేస్తున్నారు. జనసేనకు అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ కోవలోనే టెంట్ హౌస్ పార్టీ అంటూ జనసేనని విమర్శించారు పేర్ని నాని.