Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ జారీ అయింది. ఏపీలోఅసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దాని పైన ఇప్పటికే కూటమి పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన రెండు టీడీపీకి దక్కనున్నాయి. ఆ క్రమంలో రాజ్యసభకు వెళ్లే దెవరనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక
నాలుగు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీన ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో ఖాళీ అయిన ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌లో వెల్లడించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
డిసెంబర్ 3వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10వ తేదీ.. అభ్యర్థి నామినేషన్ వేసేందుకు చివరి తేదీగా నిర్ణయించారు, ఇక డిసెంబర్ 11వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
టీడీపీకి రెండు, జనసేనకు ఒక రాజ్యసభ స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆ ముగ్గురు వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది.
Also Read: తాజ్ హోటల్‌లో.. ఎంపీలకు దావత్ ఇస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం
ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. కేవలం 11 స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ అనుసరించిన.. అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీలోని అగ్రనేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అంతా గుర్రుగా ఉన్నారు. ఆ క్రమంలో పార్టీ ఓటమి పాలైన నాటి నుంచి పలువురు వైసీపీని వీడుతున్నారు. అలా మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో రాజ్యసభ స్థానానికి సైతం రాజీనామాలు చేశారు. అనంతరం వీరిద్దరు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
రాజ్యసభలో 11 నుంచి 8కి తగ్గిన వైసీపీ బలం
ఇక బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే గతంలో హైదరాబాద్‌లోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. జగన్ బీసీ ఓటు బ్యాంకు లెక్కలతో ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి రాజ్యసభకు పంపారు. కృష్ణయ్య తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకునే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది . ఆ ముగ్గురి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి ఎనిమిదికి తగ్గిపోయింది.
టీడీపీ నుంచి ప్రముఖంగా వినిస్తున్న గల్లా జయదేవ్ పేరు
ఖాళీ అయిన ఆ మూడు స్థానాల్లో నియామకంపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి రెండు, జనసేనకు ఒక స్థానం ఖాయమైందంట. టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో ఒకటి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో కనిపిస్తున్నారు. మంత్రివర్గం లో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు సైతం పరిశీలనలో ఉందంటున్నారు.
జనసేన నుంచి ఫోకస్ అవుతున్న నాగబాబు
జనసేనకు దక్కే రాజ్యసభ స్థానంలో రేసులో మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కటంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఆయన పేరు రాజ్యసభ రేసులో ఫోకస్ అవుతుంది. మొత్తమ్మీద ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీ, జనసేనలకు ఈ ఉపఎన్నికలతో పెద్దల సభలో చోటు దక్కనుంది.