Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. ఇంతకీ పవన్ ఢిల్లీ టూర్ వెనక జరుగుతున్న సీనేంటీ..?
అవును.. పవన్ వరుస ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే ఇలాంటి చర్చలే నడుస్తున్నాయి. ఏపీలో కూటమి సమీకరణానికి పవన్ కీలక పాత్ర పోషించారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఈ విషయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నోసార్లు ప్రస్తావించింది. పవన్ కల్యాణ్ చొరవతోనే కూటమి ఏర్పాటై.. వైసీపీ ఓట్లు చీలకుండా.. గెలుపు సాధ్యమైందని గంటాపదంగా చెబుతారు. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది కూటమి. దీంతో పవన్ రేంజ్ ఒక్కసారిగా నేషనల్ లెవల్‌కు చేరింది. డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి తన బాధ్యతల్లో బిజిగా మారిన పవన్.. సేమ్ లెవల్‌లో హిందూ వాదుల్లో ఆయన మైలేజ్ బాగా పెరిగింది. దానికి కారణం తిరుమల వేదికగా సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని పిలుపునివ్వడం. ఈ స్టేట్ మెంట్ తర్వాత బీజేపీకి పూర్తిగా దగ్గరయ్యారు పవన్. ఇక ఇప్పుడు ఢిల్లీ టూర్స్‌తో హీటెక్కిస్తున్నారు. దీని వెనక మతలబు ఏదో ఉందనే చర్చ జోరందుకుంది.
గత 15 రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఇటీవల టూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్నటి పర్యటనలో పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ శెకావత్, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్‌ను.. పవన్‌కల్యాణ్ కలిశారు. ఆయా శాఖల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వారాహి డిక్లరేషన్ ప్రతులను అందజేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి.. కేంద్రమంత్రులు ఇచ్చిన హామీలపట్ల ఉపముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: ఢిల్లీ నుండి పిఠాపురంకు పవన్ కళ్యాణ్ వరాలు.. ఇక ఆ పెద్ద సమస్య తీరినట్లే..
మరోవైపు.. ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి.. AIIB నుంచి తీసుకునే రుణంలో వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం బిల్లులు రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని అడిగారు. ఏఐఐబీ ఇదివరకు ఒప్పుకున్న ప్రకారం 3వేల 834.52 కోట్లు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు.
ఇప్పటికే పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఏపీకీ సంబంధించిన పెండింగ్ పనులను చకచకా క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. పవన్ నుంచి ఎలాంటి రిక్వెస్టులు వచ్చినా వెంటనే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరుగుతోంది. అందుకే పవన్ వెళ్లడమే ఆలస్యం చకాచకా అపాయింట్ మెంట్ దొరకడం, మీటింగ్స్ జరిగిపోతున్నాయి. తద్వారా పవన్‌ను ఎక్కడ డిసపాయింట్ చేయకూడదని కమలం భావిస్తోంది. మొత్తంగా కలిసొచ్చిన పవన్‌ను ట్రంప్‌కార్డ్‌లా వాడాలని బీజేపీ భావిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సమాధానం రాబోయే రాజకీయమే చెప్పాలి.
ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మోదీతో భేటీ కానున్నారు. జల్‌జీవన్ మిషన్ అమలు ఏపీకి రావాల్సిన నిధులపై చర్చంచడంతో పాటు.. పవన్ విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.