మంత్రి నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం జగన్ ఒక ట్వీట్ వేశారు. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దానికి పూర్తి బాధ్యత లోకేష్ వహించాలన్నారు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థుల ప్రశ్నా పత్రాలను మాత్రమే పునర్ మూల్యాంకనం చేశారని, అలా కాకుండా కోరిన ప్రతి విద్యార్థి ఆన్సర్ షీట్స్ ని రుసుము లేకుండా తిరిగి మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేశారు జగన్. టెన్త్ పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025
అనాలోచిత నిర్ణయాలు..
కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని తన ట్వీట్ లో పేర్కొన్నారు జగన్. కూటమి నేతల అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని.. ఇదే ఇలా ఉండే, ఇక మిగతా వ్యవస్థలను ఇంకెంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
బాధ్యత ఎవరిది..?
ఏపీలో పదోతరగతి పరీక్షలను 6.14 లక్షల మంది రాశారని, పారదర్శకంగా వారి ప్రశ్నాపత్రాలను దిద్ది మార్కులు ప్రకటించాల్సిన అధికారులు తప్పులు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారన్నారు జగన్. ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలతో సహా.. ఇతరత్రా అడ్మిషన్లలో కొంతమంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఈ తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని జగన్ ప్రశ్నించారు.
లీకేజీ సంగతేంటి..?
పదోతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయినా కూడా కాలేదని కూటమి ప్రభుత్వం కవర్ చేసుకుందని, తప్పులను సరిదిద్దుకోకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం అని అన్నారు జగన్. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే దెబ్బతీసిందన్నారాయన. నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన.. ఇలాంటి మంచి కార్యక్రమాలను తాము ప్రవేశ పెట్టామని.. కక్షగట్టి వాటిని నీరుగార్చారని విమర్శించారు. అమ్మఒడిని రద్దు చేశారని, ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారని మండిపడ్డారు.
ఏపీలో ఇటీవల పదోతరగతి విద్యార్థిని ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఘోర తప్పిదం జరిగిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీహైస్కూల్ విద్యార్థిని ఈమని తేజస్వినికి సోషల్ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో 90మార్కులు దాటాయి. సోషల్ లో మాత్రం 23 మార్కులతో ఆమె ఫెయిలైంది. రీకౌంటింగ్ లో ఆమెకు సోషల్ లో 96 మార్కులు వచ్చాయి. దీంతో టోటల్ 575 వచ్చింది. ఒకటీ అరా మార్కులతో ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్ లో పాసయ్యారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. 96 మార్కులు వచ్చిన విద్యార్థినికి 23 మార్కులు వేయడం దారుణం అంటూ చాలామంది విమర్శించారు. ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు జగన్. దీనికి లోకేష్ ని బాధ్యుడిగా చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేస్తూ ట్వీట్ పెట్టారు.