Fengal Cyclone: ఫెయింజల్ తుఫాను ఎఫెక్ట్ తో తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నై నగరం జలసంద్రంగా మారింది. తీరం వెంబడి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో చెన్నైతో పాటూ మరో ఆరు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురు గాలులుచ వర్ష బీభత్సంతో చెన్నై ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అంతే కాకుండా తుఫాన్ కారణంగా పలు విమానాలను రద్దు చేశారు. చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది.
వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనాలను రోడ్డుపైనే విడిచివెళుతున్నారు. చెన్నై తడా జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. మరోవైపు ఫెయింజల్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
Also read: డిసెంబర్ నెల తిరుమల వెళ్తున్నారా.. ఈ తేదీలు మరచిపోవద్దు
రాబోయే రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుండే రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తుండగా రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆది సోమవారాల్లో పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం వరకు మత్స్య కారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టుకు ఆరో నంబర్, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మూడో నంబర్ హెచ్చరికలు జారీ చేసింది.