సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు బెయిలుపై విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. గతంలో హుషారుగా కనిపించే పోసాని.. జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం అంత హడావిడిగా లేరు. మొహానికి కర్చీఫ్ కట్టుకుని జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చీరాగానే ఆయన్ను వైసీపీ నేతలు చుట్టుముట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన్ను పలకరించారు. ఆ తర్వాత వెంటనే పోసాని కారెక్కి వెళ్లిపోయారు.
పోసాని గారూ హౌఆర్యూ..
అంబటి రాంబాబు తెలిసి అడిగారో, లేక తెలియక అడిగారో కానీ.. జైలునుంచి బయటకొచ్చిన పోసానిని ఆయన హౌఆర్యూ అంటూ పలకరించారు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో పోసానికి అర్థం కాలేదు. 24రోజులపాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, పలు దఫాలుగా అటు ఇటు ఊళ్లు తిరగాల్సి వచ్చింది. చివరకు సీఐడీ కస్టడీ తర్వాత ఆయనకు బెయిలొచ్చింది. బెయిలొచ్చినా కాస్త ఆలస్యంగానే ఆయన విడుదలైన విషయం తెలిసిందే. ఇన్ని తెలిసి కూడా అంబటి హౌఆర్యూ అని పలకరించడంతో పోసాని కాస్త హర్ట్ అయినట్టున్నారు. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆయన గడ్డం పట్టుకుని బాగున్నానండీ అని చెప్పారు. ఎక్కడా ఆయన మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కూడా కనిపించలేదు. కాసేపు ఆయనతో అంబటి మాట్లాడాలనుకున్నారేమో కానీ, ఆయనకు ఆ అవకాశం పోసాని ఇవ్వలేదు. వెంటనే కారెక్కి అట్నుంటి అటే వెళ్లిపోయారు. జైలు వద్ద సీన్ క్రియేట్ చేద్దామనుకున్న వైసీపీ బ్యాచ్ కి పోసాని దొరకలేదన్నమాట. గతంలో కూడా ఓసారి జైలు వద్దకు అంబటి వచ్చినా.. పోసాని మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
వైసీపీ నేతల వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని పోసానిలో అంతర్మథనం మొదలైనట్టు అర్థమవుతోంది. వైసీపీ నేతలంతా హ్యాపీగానే ఉన్నారు. ఆయనతో మాట్లాడించినవారు, స్క్రిప్ట్ అందించినవారు అందరూ బయటే ఉన్నారు. కానీ వారి స్క్రిప్ట్ ఫాలో అయినందుకు పోసాని జైలుకెళ్లాల్సి వచ్చింది. వెంటనే బెయిలొస్తుందేమోనని అనుకుంటే.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు వేయడంతో ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. అరెస్ట్ చేసిన రోజే.. ఆయన్ను బయటకు తీసుకొస్తానంటూ రంగంలోకి దిగిన వైసీపీ నేత, లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చేతులెత్తేశారు. చివరకు వైసీపీ లాయర్ల ప్రమేయం లేకుండానే, సహజ పద్ధతుల్లోనే పోసానికి బెయిలొచ్చినట్టయింది. ఇక్కడ కూడా ఆ క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ బ్యాచ్ జైలు వద్దకు రావడంతో పోసాని వారిని చూసి కారెక్కి వెళ్లిపోయారు.
కాస్త ఆలస్యంగా
30 ఫిర్యాదులు, 17 కేసులు.. దాదాపు 24రోజులపాటు జైలు జీవితం.. ఇదీ క్లుప్తంగా పోసాని కేసు వ్యవహారం. ఫిబ్రవరి 26వతేదీన హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోసానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాకు తరలించి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆయనకు రిమాండ్ విధించడంతో కడప జైలుకి తరలించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ కేసుల వల్ల ఆయన్ను పీటీ వారెంట్లపై ఆయా ప్రాంతాల పోలీసులు తీసుకెళ్లారు. ఆయా కేసుల్లో బెయిల్ వచ్చినా.. చివరకు సీఐడీ కేసులో మరికొన్ని రోజులు ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. చిట్ట చివరకు సీఐడీ కేసులో కూడా మార్చి 21 న బెయిలు మంజూరైంది. ప్రాసెస్ కాస్త లేట్ కావడంతో ఈ రోజు సాయంత్రం ఆయన విడుదలయ్యారు.