Fire Accident: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలోని అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగి, చూస్తుండగానే అనాథ ఆశ్రమం మొత్తం వ్యాపించాయి. వెంటనే అలర్టయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. మరో ఆరుగురు విద్యార్థులు మాత్రం గదిలోనే చిక్కుకున్నారు. పిల్లల అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు.. తలుపులు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథ ఆశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్ధులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఆశ్రమం యాజమాన్యం విద్యార్ధులను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read: జనసేనలోకి దువ్వాడ వాణి? క్లారిటీ ఇచ్చేసిందిగా..
అయితే వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీఎత్తున మంటలు చెలరేగడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏదైనా కుట్ర కోణం ఉందా? లేకపోతే మామూలుగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.