Tirumala: అయ్యయ్యో.. తిరుమల గిరుల్లో అగ్నిప్రమాదం.. శేషాచలం అటవీ శ్రేణుల్లోని కాకులమాను ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, అడవిలోని ఎండుటాకులు, పొదలకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ మంటలు క్రమంగా గాలిమరలు (విండ్‌మిల్స్) ఉన్న ప్రాంతానికి చేరువ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గాలి వేగానికి మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఏర్పడింది.
అయితే ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అటవీ విభాగం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు విండ్‌మిల్ యూనిట్లకు సోకకుండా ఉండేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. అటవీ మార్గాల్లో ఫైర్ ఇంజన్లు వెళ్లడం కష్టతరమైనప్పటికీ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
అటవీ సంపదకు, వన్యప్రాణులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాకుండా మంటలు వ్యాపించిన పరిసరాల్లో ఫైర్ లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా అగ్నికీలలు మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అటవీ సిబ్బందికి అవసరమైన సహకారాన్ని అందిస్తోంది.
Also Read: పోస్ట్ మార్టానికి కారణమైన వాళ్లక్కడికే.. 90 రోజుల్లో సోషల్ మీడియా బ్యాన్-సీఎం చంద్రబాబు
అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎండల తీవ్రత లేదా అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కొంత మేర నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పర్యావరణానికి, పవిత్ర క్షేత్ర పరిసరాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. పూర్తిస్థాయిలో మంటలు ఆరిపోయే వరకు నిఘాను కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల-శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు
కాకులమాను అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు
విండ్‌మిల్ ప్రాంతానికి ఆనుకుని మంటలు
రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది
Fire breaks out in Tirumala-Seshachalam forest area in Kakulamanu pic.twitter.com/vnYpkSWRVI
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2026