దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వ్యవహారాలు ఇటీవల కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ కోసం అన్న జగన్ గెలుపుకోసం పని చేసిన షర్మిల, చివరకు ఆయనకే వ్యతిరేకంగా మారారు. తల్లి విజయమ్మ కూడా కూతురు షర్మిలవైపే ఉండటంతో ఆ కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా వైఎస్ కుటుంబాన్ని ముక్కలుగా చేసింది. కుటుంబ కలహాలు ఎలా ఉన్నా.. తల్లీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గవనే అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు అని నిరూపించారు జగన్. వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఈరోజు మేదరమెట్ల గ్రామానికి వచ్చారు జగన్. అదే సమయంలో ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా వచ్చారు. కానీ వారిద్దరి మధ్య గతంలో లాగా మాటలు లేవు. ఇంటి లోపల జగన్ ని తల్లి విజయమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నా.. జగన్ మాత్రం మునుపటిలాగా కనపడలేదు. విజయమ్మ అభిమానం తరగలేదని, అదే సమయంలో జగన్ నుంచి మాత్రం పెద్దగా రియాక్షన్ లేదని ఆ వీడియోలు, ఫొటోలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
ఇక వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో కనీసం విజయమ్మ పేరు కూడా ప్రస్తావించక పోవడం విశేషం. కేవలం జగన్ వచ్చారు, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు, వెళ్లారు అని రాశారే కానీ, విజయమ్మ కూడా వచ్చారనే విషయాన్ని ప్రస్తావించలేదు. తల్లి, కొడుకు మధ్య మరింత దూరం పెరిగిందనడానికి ఇదే తాజా సాక్ష్యం. వైసీపీ, వైసీపీ మీడియా కూడా విజయమ్మను పూర్తిగా లైట్ తీసుకున్నట్టు స్పష్టమైంది.
మేదరమెట్లకు శ్రీ @ysjagan.. వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్ధివ దేహానికి నివాళులు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వైవీ సుబ్బారెడ్డి… pic.twitter.com/O6WDqbdoxC
— YSR Congress Party (@YSRCParty) March 18, 2025
గతంలో కుటుంబ కలహాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ ఘాట్ కి వెళ్లినప్పుడు తల్లి విజయమ్మ, కొడుకు జగన్ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. బిడ్డను ఆమె ఆశీర్వదించేవారు, దగ్గరకు తీసుకునేవారు. కానీ ఇప్పుడు తల్లీ కొడుకుల మధ్య కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాల్లో వాటాల గొడవలతో దూరం పెరిగింది. విజయమ్మ తన కుమార్తె షర్మిల దగ్గరే ఉంటున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కార్యక్రమాల్లో మాత్రమే జగన్, విజయమ్మ కలిసే సందర్భాలు వస్తున్నాయి. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వాటాల విషయంలో వీరి మధ్య గొడవ బాగా పెరిగింది. అందులో వాటాలు కావాలని షర్మిల కోర్టుకెక్కడం, ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ వాదించడం.. ఈ వ్యవహారంలో విజయమ్మ జోక్యం చేసుకుని కుమార్తె షర్మిలకు మద్దతుగా మాట్లాడటంతో వ్యవహారం మరింత ముదిరి పాకాన పడింది. అంటే జగన్ ఒకవైపు, షర్మిల-విజయమ్మ మరోవైపు అన్నట్టుగా ఈ వ్యవహారం నడుస్తోంది.
ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా విజయమ్మ, షర్మిలను శత్రువులుగానే చూస్తున్నారు. గతంలో ఎప్పటికైనా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒకటేనని చెప్పిన నేతలు కూడా ఇప్పుడు షర్మిల, విజయమ్మలపై విమర్శలు చేసేందుకు వెనకాడటం లేదు. కనీసం వైఎస్ఆర్ సతీమణిగా కూడా విజయమ్మను వారు గౌరవించడం లేదని తెలుస్తోంది. సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్ కి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడంతో విజయమ్మ కూడా వారికి శత్రువుగా మారిపోయింది.
కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆ రెండు వర్గాల మధ్య సఖ్యత లేదనే విషయం స్పష్టమైంది. ఓవైపు పార్టీనుంచి వెళ్లిపోతున్న నేతలు, మరోవైపు కుటుంబంలో కలతలు.. వీటన్నిటితో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్, అక్కడే ఉన్న తన తల్లి విజయమ్మతో మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. విజయమ్మ మాత్రం కొడుకుని దగ్గరకు తీసుకుంది.