Ticket Cancellation And Refund Rules: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలను కొనసాగిస్తారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందుతారు. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తాయి. దేశంలోని ఒకటి, రెండు మినహా మొత్తంగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఎక్కువగా రైల్వే ప్రయాణానికే మొగ్గు చూపుతారు. పలువురు ప్రయాణీకులు చివరి క్షణంలో ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. ఛార్జీలు మినహాయించుకుని మిగతా డబ్బును రీఫండ్ చేస్తుంది రైల్వే సంస్థ. అటు అనివార్య కారణాలతో రైళ్లు రద్దు అయినా టికెట్ డబ్బులను ప్రయాణీకులకు రీఫండ్ ఇస్తుంది.
రీఫండ్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రద్దు చేయబడిన రైళ్లకు, టికెట్లు రద్దు చేసుకున్న వారు రీఫండ్ పొందే అంశానికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక సలహా ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడే ప్రయాణీకులు మొబైల్ నెంబర్ ను అందించాలని చెప్పింది. రైల్వే రీఫండ్ నిబంధనల ప్రకారం, ప్రమాదాలు, ఉల్లంఘనలు, వరదలు, బంద్, రైల్ రోకో జరిగిన సమయాల్లో రైళ్లు పూర్తిగా రద్దు అవుతాయి. ఈ నేపథ్యంలో PRS కౌంటర్ ద్వారా బుక్ చేసుకున్న రిజర్వేషన్ టికెట్ ను రైలు షెడ్యూల్ తర్వాత మూడు రోజుల్లోగా ఏదైనా రైల్వే స్టేషన్ లోని PRS కౌంటర్‌లో సరెండర్ చేయాలి. దానిని సమర్పించిన తర్వాత, చెల్లించిన పూర్తి ఛార్జీని ప్రయాణీకుడికి ఎటువంటి రద్దు ఛార్జీలు లేకుండా రీఫండ్ చేస్తుంది. అటు ఆన్ లైన్ ద్వారా అంటే.. ఇ-టికెట్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు ఆటోమేటిక్ గా రద్దు చేయబడుతాయి. ఛార్జీల పూర్తి రీఫండ్ IRCTC ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. డబ్బులను లింకై ఉన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.
Read Also: కాశ్మీర్ అందాలు చూడాలనుందా? తక్కువ ధరలో స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC!
టికెట్ బుకింగ్ సమయంలో ఫోన్ నెంబర్ ఇవ్వాలన్న రైల్వే
చాలా మంది రైల్వే ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో తమ ఫోన్ నెంబర్ ను ఇవ్వరు. అలా చేయడం మంచిది కాదంటున్నారు రైల్వే అధికారులు. రైలు సేవలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు అందిస్తారు. రీఫండ్ ప్రక్రియలోనూ మొబైల్ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రతి ప్రయాణీకుడు మొబైల్ నెంబర్ తప్పని సరిగా ఇవ్వాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల టికెట్ క్యాన్సిలేషన్ కాగానే డబ్బులను నేరుగా అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగానూ పేమెంట్ చేసే వెసులు బాటు ఉంటుందంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా రైళ్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మెసేజ్ ల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ రైళ్లు రద్దు అయితే, ఆ విషయాన్ని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నారు.
Read Also: విశాఖ నుంచి వచ్చే ప్రయాణీకులకు అలర్ట్, ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ లో ఆగవట!