Tirumala Free Darshan: మీరు తిరుపతి స్థానికులా.. అలాగే పరిసర మండలాలకు చెందిన వారైతే, ఈ ఛాన్స్ మాత్రం మిస్ కావద్దు. టీటీడీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎందుకంటే ఈ భాగ్యం మీకు కలగడం.. మీ అదృష్టం. నేరుగా కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు మీకు కల్పించిన భాగ్యమే ఇది. పూర్తి విషయాలలోకి వెళితే..
ఇటీవల టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాధ్యతలు చేపట్టిన అనంతరం తిరుమలకు సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా టీటీడీ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్థానిక భక్తులకు నెలలో ఒకరోజు దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. అది కూడా ఉచిత దర్శనం కాగా, స్థానిక భక్తులకు ఇదొక వరమని చెప్పవచ్చు. సాక్షాత్తు ఆ దేవదేవుని దర్శనం దొరకడం స్థానిక భక్తులకు కలిగిన మహా భాగ్యమని శ్రీవారి భక్తులు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ తీర్మానం చేసిన అనంతరం తొలిసారిగా డిసెంబర్ మూడవ తేది దర్శనభాగ్యం కలిగిస్తోంది టీటీడీ. తిరుమల, తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల వారికి ఈ అవకాశం కల్పిస్తుండగా, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటి హాల్, తిరుపతి మహాతి అడిటోరియంలోని కౌంటర్లలో డిసెంబరు 1న టోకెన్ల పంపిణీ కార్యక్రమం సాగుతుందని, స్థానిక భక్తులు తమ ఆధార్ కార్డుతో రావాలని టీటీడీ సూచించింది. మరెందుకు ఆలస్యం.. మీరు స్థానిక భక్తులైతే ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు సుమా!
ఇక,
ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శుక్రవారం శ్రీవారిని 62147 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 23096 మంది భక్తులు తలానీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికీ 10 కంపార్ట్ మెంట్ లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నట్లు, 18 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ ప్రకటించింది.
Also Read: Tirumala: తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై కొరడా
అలాగే వల్లూరి వంశీనాధ్ రెడ్డి అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేస్తూ హల్ చల్ చేసిన వార్త సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీవారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన నలుగురు ఫోటోగ్రాఫర్లతో ఫోటో షూట్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటో షూట్ చేయకూడదని వారించి అక్కడ నుండి పంపి వేసి తమ విధుల్లోకి వెళ్లడం జరిగింది. అయినప్పటికీ ఆ వ్యక్తి మరల తిరిగివచ్చి ఫోటో షూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం జరిగిందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.