Tirumala: తిరుమలలో అడుగుపెట్టామంటే చాలు.. అడుగడుగునా గోవిందా.. గోవిందా అనే నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతాయి. అలాంటి తిరుమలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది బోర్డు. గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరించనుంది. అందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం, బోర్డు ఆమోదించడం చకచకా జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో శనివారం నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం మొదలైంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శనివారం నుంచి అమలు చేస్తోంది.
దేవుడి పేరు చెప్పి తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే.. మేసెజ్ ప్రజల్లోకి వెళ్తుందనేది నేతల ఆలోచన. గడిచిన ఐదేళ్లు అక్కడి నుంచి రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలిగింది.
పరిస్థితి గమనించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాత పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది బోర్డు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ALSO READ: వైసీపీ నేతల పీఏలు అరెస్ట్.. టార్గెట్ వాళ్లేనా..?
బోర్డులో నిర్ణయం తీసుకోగానే నేతలు పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. చాలామంది నేతలు తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాట్లాడాలని కొంతమంది ఒత్తిడి చేసినా, తప్పించుకునే ప్రయత్నం చేశారు కొందరు.
అలాగే స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం కల్పించనుంది టీటీడీ. ప్రతినెలా మొదటి మంగళవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఉదయం ఐదుగంటలకు టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చు.
రీసెంట్‌గా తిరుమల కొండపై ఆలయం ముందు ఓ నాయకుడికి చెందిన బంధువులు ఫొటో షూట్ చేశారు. నలుగురు ఫొటోగ్రాఫర్లతో వీడియోలు, ఫొటోలు తీయించు కుంటూ హడావుడి చేశారు. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం గమనార్హం.
నెల రోజుల కిందటికి వెళ్తే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు ఆలయం సమీపంలో రీల్స్ చేశారు. దీనిపై టీటీడీ విభాగం ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడం జరిగిపోయింది. ఇదేకాకుండా నిత్య అన్నదానం మెనూలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకొక్కటిగా తిరుమలలో మార్పులు చేసుకుంటూ వస్తోంది టీటీడీ.