Varanasi Fire Accident| ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరం కంట్ రైల్వే స్టేషన్ లో శనివారం నవంబర్ 30, 2024న భారీ అగ్నీ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఉన్న 200కు పైగా ద్వి చక్ర వాహనాలు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయని సమాచారం. రైల్వే స్టేషన్‌లో ఉదయం తెల్లవారు ఝామునే ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక మీడియా తెలిపింది.
అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది కలిసి అగ్ని జ్వాలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వీడియోలో అయితే పోలీసుల బృందం ఒక వాటర్ హోస్ పైప్ తీసుకొని అగ్నిజ్వాలలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగ, గాలి నిండా కాలిపోయిన సామాగ్రి బూడిద కనిపిస్తోంది.
ప్రమాదం గురించి అగ్నిమాపక అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “భారీ అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే 12 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి తరలించాం. రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ బలగాలు, స్థానిక పోలీసుల బృందాలు సంయుక్తంగా అగ్నిజ్వాలలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.” అని చెప్పారు.
ప్రాథమిక విచారణలో అగ్ని ప్రమాద ఘటన షార్ట్ సర్కూట్ వల్ల జరిగిందని, ప్రస్తుతం ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు.
“పార్కింగ్ ప్రాంతంలో బైక్ లు, సైకిళ్లు అన్నీ కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూట్ అని నిర్ధారణ అయింది. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది.” అని రైల్వే పోలీస్ అధికారి కువర్ బహదూర్ సింగ్ మీడియాకు తెలిపారు. కాలిపోయిన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ శాతం రైల్వే సిబ్బందికి చెందినవే అని అధికారులు వెల్లడించారు.
Also Read: జో బైడెన్ మతిమరుపుపై రాహుల్ గాంధీ కామెంట్లు.. తమకే సంబంధం లేదని చెప్పిన కేంద్రం
అగ్నిప్రమాదానికి ముందే పార్కింగ్ స్థలంలో రాత్రి షార్ట్ సర్కూట్ జరిగిందని రైల్వే సిబ్బంది తెలిపారు. “నేను రాత్రి 12 గంటలకు పార్కింగ్ లో నా బైక్ పెట్టాను. అక్కడ ఉన్న వ్యక్తి నాకు ఇక్కడ 11 గంటలకు షార్ట్ సర్కూట్ జరిగిందని చెప్పాడు. అయితే దాన్ని సరి చేశారని విన్నాను. కొన్ని గంటల తరువాత ఒక ప్రయాణికుడు పార్కింగ్ స్థలం నుంచి వచ్చి రైల్వే స్టేషన్ బయట భారీ అగ్ని ప్రమాదం జరిగిందని మాకు చెప్పాడు. నేను వెంటనే వెళ్లి నా బైక్ బయటికి తీసి దూరంగా పార్క్ చేశాను. చూస్తూ ఉండగా.. కొన్ని నిమిషాల్లోనే అగ్ని జ్వాలలు పార్కింగ్ లాట్ మొత్తం వ్యాపించాయి.” అని ఒక రైల్వే ఉద్యోగి మీడియా ముందు చెప్పాడు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి దాదాపు రెండు గంటలపాటు శ్రమించిన తరువాత అగ్నిజ్వాలలను విజయవంతంగా ఆర్పారని అధికారులు చెప్పారు.
#वाराणसी: कैंट रेलवे स्टेशन की पार्किंग में शार्ट सर्किट से लगी आग,चपेट में आने से 200 से ज्यादा बाइक व स्कूटी जलकर राख,फायर बिग्रेड की 6 गाड़ियों ने कड़ी मशक्क़त के बाद आग पर पाया काबू.@Uppolice @varanasipolice #Varanasi pic.twitter.com/isVAJjE0jq
— Axis Metro News (@Axismetromedia) November 30, 2024