Jagan plan: వైసీపీకి కాలం కలిసి రాలేదా? ఏ అంశం ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతోందా? పార్టీ నుంచి కీలక నేతలు గుడ్ బై చెప్పేయడంతో కేడర్ డీలా పడిందా? కార్యకర్తలను కాపాడుకునేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేశారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.
అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏరి కోరి నేతలకు పదవులు ఇచ్చారు జగన్. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేతలు ముఖం చాటేస్తున్నారు. కొందరైతే పార్టీకి రాం రాం చెప్పేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది కేడర్.
కొద్దిమంది నేతలు కలిసిరావడం లేదు. పార్టీ పరిస్థితి గమనించిన జగన్, నేరుగా రంగంలోకి దిగుతున్నారు. జగన్ జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి తర్వాత వారంలో రెండు రోజుల పాటు జిల్లా పర్యటనలు చేయనున్నారు.
పార్లమెంట్ యూనిట్‌గా ప్రతి బుధ, గురువారం జిల్లాల్లో ఉంటూ కార్యకర్తలతో మమేకం కానున్నారు అధినేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు.. నష్టాలు ఉంటాయని, పోరాట పటిమతో ముందుకు సాగాలని కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
ALSO READ: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫ్రీ దర్శన భాగ్యం మిస్ చేసుకోవద్దు.. ఆ టోకెన్స్ ఎప్పుడంటే?
‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు-నేను-దేవుడు అని పదే పదే సభల్లో చెప్పేవారు జగన్. కార్యకర్తలను పక్కనపెట్టేశారు. దీంతో కొందరు దిగువ స్థాయి నేతలు మండిపడిన సందర్భాలు లేకపోలేదు.
చెదిరిపోయిన కేడర్‌ను మళ్లీ ఒక తాటిమీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేడర్ మళ్లీ పాత గూటికి చేరుకుంటుందా? అన్నదే అసలు పాయింట్. నేతలు కొంతమంది జనసేన వైపు, మరికొందరు టీడీపీ వెళ్లిపోయారు. వారితోపాటు కొంత కేడర్ వెళ్లిపోయింది. దీంతో వైసీపీ హార్డ్‌కోర్ కేడర్ డీలా పడిపోయింది.
ఇంకోవైపు అటు అధికార టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను కేడర్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. మెంబర్ షిప్‌కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కార్యకర్తలకు ఇన్యూరెన్స్ స్క్రీమ్‌ని వర్తింప చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కేడర్ నిలబడుతుందా? అధికార పార్టీకి ధీటుగా వైసీపీ కూడా కార్యకర్తలకు సదుపాయాలు కల్పిస్తుందా? లేదా అన్నది చూడాలి.