AP Govt: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు వేగవంతం చేస్తున్నారు. 2029 నాటికి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వానికి తీపి కబురు చెప్పింది కేంద్రం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY కింద 40,410 కొత్త ఇళ్లను మంజూరు చేసింది. 2024-25 ఏడాదికి 31,719 ఇళ్లు కాగా, ఈ ఏడాదికి మరో 8,691 ఇళ్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కో ఇంటికి రెండున్నర లక్షలు ఇవ్వనున్నాయి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మరొక లక్ష వరకు ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సాయాన్ని కేవలం రూ.1.80 లక్షలకు కుదించింది. ఈ కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం నత్తనడకగా సాగింది.
ఆగిపోయిన ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు అడుగులు వేస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన-PMAY-URBAN 2.0 పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచన చేసింది కేంద్రం. ఈ క్రమంలో కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు వ్యయాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు.
ALSO READ: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లబ్ధిదారులకు రూ.2.90 లక్షల వరకు సాయం అందిస్తున్నాయి. PMAY-అర్బన్ 2.0 పథకం కింద తొలి విడత 40 వేల ఇళ్లకు నిర్మాణానికి రూ.1010.25 కోట్లు మంజూరు చేసింది. కేంద్రం తన వాటాగా రూ.1.50 లక్షలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలు తన వాటాగా కలపనుంది.
ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు 90 రోజులు(మూడు నెలలకు) రూ.39 వేలు జమ కానున్నాయి. ఓవరాల్ గా పరిశీలిస్తే లబ్ధిదారులకు రూ.2.90 లక్షల వరకు ప్రభుత్వ నుంచి సాయం అందనుంది. ఇంటి నిర్మాణం కోసం ఇంకా డబ్బులు అవసరమైతే లబ్ధిదారులే పెట్టుకోవాలి. ఈ లెక్కన ఏపీలో నిర్మాణ దశలో ఉన్న ఇల్లు వేగంగా పూర్తికానున్నాయి.