East Godavari News: పెళ్లిని కొందరు వ్యక్తులు ఎగతాళి చేస్తున్నారు. మొదటి వివాహం జరిగిన విషయాన్ని తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ పెళ్లికొడుకు. చివరకు మొదటి భార్య హెచ్చరికతో జంప్ అయ్యాడు పెళ్లి కొడుకు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
పెళ్లి అనేది రెండు మనసులు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే ఒక పవిత్రమైన బంధం. సామాజిక, చట్టబద్ధమైన బంధం కూడా. కుటుంబ వ్యవస్థకు పునాది. పెళ్లి ద్వారా వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి, ప్రేమను పంచుకోవడానికి బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ఒక అవకాశం. కానీ కొందరు పెళ్లి ఎగతాళి చేసే స్థాయికి చేరుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సత్యనారాయణకు సోమవారం తెల్లవారుజామున పెళ్లి ఫిక్స్ చేశారు. గోపాలపురం మండలంలోని భీమోలు ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం తెల్లవారుజామున వివాహం జరగనుంది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాల పెద్దలు అన్నికార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.
ఆదివారం సాయంత్రం వరుడు సత్యనారాయణ కనిపించలేదంటూ అతడి బంధువులు వధువు తరఫువారికి కబురు చెప్పారు. దీంతో వధువు కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే దేవరపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. వధువు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగేశారు పోలీసులు. విచారణలో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ALSO READ: పులివెందులలో పోలింగ్.. జగన్ రూ100 కోట్లు, నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి
సత్యనారాయణకు ఐదేళ్ల కిందట భర్త చనిపోయిన మహిళతో వివాహం జరిగినట్టు తేలింది. అంతేకాదు ఆ మహిళ కూతురికి సత్యనారాయణ దగ్గరుండి మరీ వివాహం జరిపించాడు. భర్తకు రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య.. తన భర్త సత్యనారాయణకు ఫోన్ చేసింది.
తనతో ఇన్నాళ్లు కాపురం చేసి రెండో పెళ్లి చేసుకుంటే కేసు పెడతానని హెచ్చరించింది. అదే జరిగితే పోలీసులు తనను అరెస్టు చేయడం ఖాయమని భావించాడు. రెండో పెళ్లి చేసుకునే బదులు, మొదటి భార్యతో ఉండడమే బెటరని నిర్ణయానికి వచ్చాడు.
దీంతో ఎవరికి చెప్పకుండా సత్యనారాయణ మొదటి భార్యతో పారిపోయాడని ఆరోపిస్తున్నారు వధువు బంధువులు. పెళ్లి కుమార్తెకు న్యాయం జరిగేలా చూస్తామని అంటున్నారు పోలీసులు. మరి ఈ కేసుకు పోలీసులు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.