RGV: రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma).. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ ఈయన.. అంతేకాదు ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు క్షణక్షణం, గోవిందా గోవిందా , శివ లాంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో వివాదాస్పద దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్లో వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే పోలీసుల విచారణకు వర్మ వస్తాడా? రాడా? అనే విషయం కూడా ఇప్పుడు ఉత్కంఠ గా మారింది.
నేడు విచారణకు హాజరుకానున్న రాంగోపాల్ వర్మ..
అసలు విషయంలోకి వెళితే.. రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా అటు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ గత ఏడాది నవంబర్లో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూడా వర్మపై కేసులు నమోదయ్యాయి. వీరి ఫోటోలను మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చాలా ప్రాంతాలలో కేసులు నమోదు చేశారు.
వర్మ విచారణపై సర్వత్రా ఉత్కంఠ..
ఇక దీంతో వర్మకి పోలీసులు నేరుగా నోటీసులు అందజేశారు. దాంతో చేసేదేమీ లేక వర్మ హైకోర్టులో బెయిల్ పొందారు.కానీ బెయిల్ ఇచ్చే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలి అని హైకోర్టు స్పష్టం చేయగా.. గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకసారి విచారణకు హాజరైన ఈయన.. ఇప్పుడు మరోసారి విచారణకు హాజరు కావాలి అంటూ గత నెల 22వ తేదీన ఆయన ఇంటికి వెళ్లి మరీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి ఈరోజు వర్మ పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా? లేదా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ హాజరైతే అక్కడ ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు? వర్మ వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వనున్నారు? అనే విషయాలపై కూడా చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం..
రాంగోపాల్ వర్మ కెరియర్..
ఇక రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఇప్పుడు ఎక్కువగా అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సామాజిక అంశాలపై, రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ ఇలా చిక్కుల్లో పడుతున్నారని చెప్పవచ్చు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు పోలీసులు ఎదుట హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా వర్మ ఇలా ఎప్పటికప్పుడు వివాదాలలో ఇరుక్కుంటూ ఉండటం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ:Tollywood: మంచినీళ్లు అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్.. బాటిల్ ధర తెలిస్తే షాక్!