Pulivendula ByPoll: పులివెందుల బైపోల్‌ను వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారా? వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని బంధించిందెవరు? ఓ వైపు పోలింగ్.. మరోవైపు నేతలు మాటలు కోటలు దాటుతున్నాయి.
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమతమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. పోలింగ్ మొదటి నుంచి ప్రలోభాల పర్వం ఊపందుకుంది.
ఈ ఉప ఎన్నిక కోసం జగన్ వంద కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి. ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మహిళలకు ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని, పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు పులివెందులలో పోలింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి విమర్శించారు. తన ఇంటి చుట్టూ టీడీపీ గూండాలను పెట్టిందని, కర్రలు-రాడ్లు పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు.
ALSO READ: ఏపీ లిక్కర్ కేసులో కొత్త విషయాలు, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి రక్షణ కల్పించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని మండిపడ్డారు. పోలింగ్ బూత్ లోపలికి ఏజెంట్లను ఎవరినీ వెళ్లనీయలేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ విడియో విడుదల చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.
జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు, అసెంబ్లీకి ఎన్నిక జరుగుతున్నట్లు ఉందని అంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓటర్లు ఈ తరహా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 300 పైగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. లాడ్జి, హోటళ్లు తనిఖీలు చేశారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారిని వారి ప్రాంతాలకు తరలించారు.
జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం జగన్ వంద కోట్లు ఖర్చు చేశారు: బీటెక్ రవి
ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారు
ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారు
అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు
– పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి pic.twitter.com/MKpkaVCgMP
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2025