Guntur boy petition: గుంటూరులో ఒక 4వ తరగతి విద్యార్థి, తల్లి ఆత్మహత్య చేసుకుంటుందేమోనని కలవరపడుతూ కలెక్టర్ దృష్టిని ఆకర్షించేందుకు స్వయంగా అర్జీ ఇచ్చాడు. కొందరి చర్యల వల్ల తల్లి జీవనోపాధి పోయిందని, న్యాయం చేయాలని వేడుకున్న ఈ చిన్నారి మాటలు.. చిన్న పిల్లల కళ్ళలోనూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
చిన్నారి బాధ.. పెద్ద చైతన్యం
ఇది నిజమైన సంఘటన. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ హృదయవిదారక ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన 4వ తరగతి విద్యార్థి యశ్వంత్, తన చిన్ని చేతులతో రాసిన అర్జీని కలెక్టర్‌కు అందజేశాడు. అది చదివిన ప్రతి ఒక్కరు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
టిఫిన్ బండిని తొలగించారా..?
యశ్వంత్ తల్లి జీవనోపాధి టిఫిన్ బండి. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) వద్ద చిన్నగా టిఫిన్ బండి పెట్టుకుని రోజూ కుటుంబాన్ని పోషించేది. కానీ ఇటీవల మున్సిపల్ అధికారులు వచ్చి ఆ బండిని తీసేసారని యశ్వంత్ తన అర్జీలో వేదనతో వివరించాడు. తల్లి తీవ్ర మనోవేదనకు లోనై మనిద్దరం చనిపోదాం అన్నట్లు బాలుడు కలెక్టర్‌కి రాసిన మాటలు ఉద్వేగానికి లోనుచేస్తున్నాయి.
అమ్మ కన్నీళ్లను చూడలేక పోతున్నా..
చిన్న వయసులోనే బాధను అర్థం చేసుకునే స్థాయికి వచ్చిన యశ్వంత్, తన తల్లి కన్నీళ్లను తట్టుకోలేకే ఈ అర్జీ ఇచ్చాడు. ఆ చిన్నారి మాటల్లోనే అమ్మ టిఫిన్ బండి పోవడంతో చాలా బాధపడింది సార్. తినడానికి డబ్బు లేదు. స్కూల్ వెళ్లడం కూడా కష్టమవుతోంది. అమ్మ నన్ను బుజ్జిగా చూసి మనం ఇద్దరం చచ్చిపోదాం అంది. నాకు భయంగా ఉంది. దయచేసి న్యాయం చేయండి అంటూ చెప్పిన మాటలు నేరుగా మనసుకు తాకకుండా ఉండవు.
కలెక్టర్ స్పందిస్తారా..?
గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన యశ్వంత్ అర్జీకి కలెక్టర్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఈ విషయంపై గుంటూరు ప్రజలు, సామాజిక కార్యకర్తలు స్పందిస్తూ ఇలాంటి చిన్నారుల జీవితాల్ని అధికార తీరుతో నాశనం చేయకూడదని చెబుతున్నారు. అయితే కలెక్టర్ కూడా వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read: 3d Printed Railway Building: ఏపీలోని ఈ రైలు భవనం.. 3D ప్రింటెడ్ నిర్మాణమంటే నమ్ముతారా?
సాధారణంగా చిన్న టిఫిన్ బండ్లపై నిబంధనలు ఉండొచ్చు. కానీ పేదవారి జీవనోపాధిని కాదనడం మనుషుల తీరా? ఒక్క అధికార ఉత్తర్వుతో తిండి బండిని తొలగించటం ఎంతవరకు సమంజసం? సంబంధిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి కానీ, బండిని తీయడం వలన ఆ కుటుంబం జీవించడానికే అవకాశం కోల్పోయిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
పాఠశాల పిల్లాడి గొంతు.. పాలకులకు వినిపించాలి
యశ్వంత్ వయసు చిన్నదైనా అతని గొంతు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది తన తల్లిని ప్రాణాలు తీసుకునే ఆలోచన నుంచి కాపాడాలని, పేదవాడికి న్యాయం కావాలన్న కోరికతో వచ్చినది. మన ప్రభుత్వ వ్యవస్థ చిన్నారి గొంతుకను వినిపించుకోవాలని పలువురు వాదిస్తున్నారు.
ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, మానవతా సంఘాలు తల్లికి మళ్లీ టిఫిన్ బండి ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భవిష్యత్‌ను కాపాడండి..
ఇక్కడ విషయం ఒక చిన్న బండి గురించీ కాదు.. అది ఒక కుటుంబం ఆశలు, బతుకులు దానిపై ఆధారపడి ఉన్నాయి. అధికారులు ఒక్కసారి ఆ బండిని తొలగించడమే కాదు.. ఆ కుటుంబ ఆశలను తొలగించారని, ఇప్పుడు ఆ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టాలంటే తిరిగి బండి పెట్టడం కాదు, వాళ్లకు భరోసా ఇవ్వడం, మానవతా విలువలతో స్పందించడం ముఖ్యమన్న వాదన వినిపిస్తోంది. మొత్తం మీద ఇప్పుడు జిల్లా కలెక్టర్ స్పందించే తీరుపై మొత్తం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.