Hyderabad Fire Accident: ఓ బ్లాస్ట్ బతుకులను బుగ్గి చేసింది. కొందరు కార్మికుల సజీవ దహనానికి కారణమైంది. మరికొందరిని ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడేలా మార్చింది.. మొత్తంగా పదుల సంఖ్యలో కార్మికుల జీవితాలను రోడ్డున పడేలా చేసింది. వారి కుటుంబాలను తీవ్ర దుఃఖ సాగరంలో మునిగేలా చేసింది ఈ ఘటన.
ఇప్పటి వరకు 14 మంది మృతి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. 34 మందికిపైగా గాయాలయ్యాయి. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.
సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్ట్ పేలుడు
సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 7 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. శిథిలాల కింద 30-40 మంది ఉన్నట్లు సమాచారం. శిథిలాల కిందున్న వారి గుర్తించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పరిశ్రమ లోపల పరిస్థితిని డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
మరోవైపు పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే టైంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమవారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాకర్టీలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఈ ఘటనపై ద్రౌపతి ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
పాశమైలారం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాంటూ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడూ ఆరా
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారు. మినట్ టు మినట్ స్పాట్‌లో ఏం జరుగుతోంది అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలపై రాజకీయం చేయడం సరికాదు
దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలపై రాజకీయం చేయడం సరికాదని వైద్యారోగ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పాశమైలారం ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఘటనా స్థలిని కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఇటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులును మంత్రి దగ్గరుండి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
Also Read: రూ. 2.5 కోట్లతో పెళ్లి.. రెండు నెలల్లోనే నవ వధువు.. దారుణం
శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని అనుమానం
పాశమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన కొనసాగుతోందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి. శిథిలాల కింద ఎంతమంది కార్మికులు ఉన్నారో స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 12మంది చనిపోయారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారాయన.