Nara Lokesh Tour: మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్.. అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్‌లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ-న్యూసౌత్ వేల్స్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన లోకేశ్.. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీ, న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని కోరారు.
వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. వర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో పలు అంశాలు చర్చించారు. ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేశ్ కోరారు. రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్‌కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఇక ఏపీ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ తదితర ప్రాజెక్టులపై సహకారం అందించాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఇక ఈనెల 24వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగనుంది.
భారత్ నుంచి రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియాలో అడ్డంకి తొలగింది. పొట్టు తీయని రొయ్యల ఎగుమతికి లైన్ క్లియర్ అయింది. ఆంక్షలు తొలగడంపై మంత్రి లోకేశ్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతికి లైన్ క్లియర్ అయిందన్నారు. పొట్టు తీయని రొయ్యలపై ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు తొలిగిపోయాయని చెప్పారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఎక్స్ లో పోస్టు చేశారు. 2025 అక్టోబర్ 20 నుంచి 2027 అక్టోబర్ 20వరకు రొయ్యలను ఎగుమతి చేసుకోవచ్చు.
భారత్ నుంచి సీఫుడ్స్ ఎక్స్ పోర్ట్ కు చాలా కాలంగా ఉన్న అడ్డంకి తొలగిపోయిందని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన భారత అధికారులకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.