Harsha kumar on Pastor: పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఏం జరిగింది? ఇది ముమ్మాటికీ హత్యేనని మాజీ ఎంపీ హర్షకుమార్ ఎందుకన్నారు? పోలీసుల దర్యాప్తు తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా? హర్షకుమార్ చెప్పిన కొత్త నిజాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని ఇప్పుడు వెంటాడుతున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు గురించి కొత్త విషయాలు బయటపెట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్. మంగళవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, కొన్ని విషయాలపై అనుమానం వ్యక్తంచేశారు. ఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారాయన. పాస్టర్ ప్రవీణ్ పగడాలను మతోన్మాదులు హత్య చేశారని వ్యాఖ్యానించారు.
పాస్టర్ ప్రవీణ్ ఘటన తర్వాత కొన్ని వీడియోలు వచ్చాయని, వాటినే పోలీసులు విడుదల చేశారన్నారు హర్షకుమార్. ఆ వీడియోలపై ప్రజలు పరిశోధనలు మొదలుపెట్టారు. వాటినే పోలీసులు మళ్లీ విడుదల చేశారన్నారు. విచిత్రం ఏంటంటే పోలీసులే ఆ వీడియోలను వారికి ఇచ్చారన్నారు. పాస్టర్ ప్రవీణ్‌ను తాగుబోతు అని చెప్పడానికి ఇదంతా చేశారన్నది ఆయన ప్రధాన ఆరోపణ.
పోలీసుల విడుదల చేసిన ఏ వీడియోలోనూ పాస్టర్ ముఖం కనిపించలేదన్నారు. తాను మాట్లాడిన మాటలు ఏ మతానికి వ్యతిరేకం కాదని చెబుతూనే, మతోన్మాదుల శక్తులు అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వారిలోనున్న మతోన్మాదులు చేసిన హత్యగా వర్ణించారు.
ALSO READ: జైలులో గోరంట్లకు రాజభోగాలు.. తలలు పట్టుకుంటున్న అధికారులు
ఆర్ఎస్ఎస్‌లో కొన్ని గ్రూపులకు చెందిన వ్యక్తులు బాబ్రీ మసీదును కూలగొట్టారన్నారు. ప్రవీణ్ పగడాల ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తని, ఆయన ప్రసంగాలకు చాలామంది ప్రభావితం అయ్యారని గుర్తు చేశారు. దీనికి మరొక రీజన్ చెప్పారు హర్షకుమార్.
పాస్టర్ ప్రవీణ్ (ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్) కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు హర్షకుమార్. ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చని రాజ్యంగంలో ఉందన్నారు. దీనిపై కొన్ని బీజేపీ పాలిట రాష్ట్రాలు ఆర్డినెన్సులు తెచ్చాయన్నారు. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కొంతమంది పిటీషన్లు వేశారన్నారు. వాటిలో మూడేళ్ల కిందట ప్రవీణ్ పగడాల ఇంప్లీడ్ అయ్యారని గుర్తు చేశారు.
ఆ విషయంపై కొన్ని రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతున్నాయని వివరించారు. ఆయా పిటిషన్లపై ఏప్రిల్ 16న(బుధవారం) సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయని వివరించారు హర్షకుమార్. ఈ కేసులో అందరూ లాయర్లను ఏర్పాటు చేసుకున్నారని, పాస్టర్ లాయర్లను పెట్టుకోలేదన్నారు. ఆ కేసును తానే వాదిస్తానని చెప్పారని వివరించారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల ల్యాప్ టాప్, ఐపాడ్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆయన బ్యాంకు అకౌంట్లను ఎందుకు సీజ్ చేశారు? యాక్సిడెంట్ కేసుకి బ్యాంకు అకౌంట్లకు సీజ్ లింక్ ఏంటన్నది ఆయన ప్రశ్న. ఈ కేసు వీగిపోతే వాళ్ల లక్ష్యం నెరవేరుతుందన్నారు. దేశాన్ని హిందూమతంగా చేయాలని భావిస్తున్నారు. రేపటి రోజున అన్ని రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.
క్రైస్తువుల సమావేశానికి వెళ్లేవారు మందు కొట్టి వెళ్తారా? అంటూ కొత్త డౌట్ క్రియేట్ చేశారు. ఒక మనిషి క్యారెక్టర్‌ని చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్నింగ్ బాడీ లభిస్తే.. సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఫైనల్ రిపోర్టు వచ్చేంతవరకు ఆగి బయటపెట్టారన్నారు. అలాగే ఐజీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చాలా తప్పుడు విచారణ చేశారని దుయ్యబట్టారు. దీనిపై రాసి రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి ఇస్తానన్నారు.