AP Rains: ఈశాన్య బంగాళాఖాతంలోని అల్పపీడనం, గురువారం ఏర్పడే మరో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో రాగల మూడు గంటల్లో పిడుగుపాటుతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు.
శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల,పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయి.
తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. చెట్ల కింద నిలబడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఉత్తరాంధ్రలో ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. తదుపరి 1-2 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనకాపల్లి, విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Also Read: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.