Telugu states Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలతో ప్రకృతి ఆడుకుంటుంది. నిన్న మొన్నటి వరకు వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగకుండా వర్షాలు మళ్లీ వస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు చలి ప్రజలను వణికిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఒకవైపు చలితో.. మరోవైపు వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలు ఇంకా దంచుడే.. దంచుడు..
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ- వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు. నేడు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం నాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం.. నవంబర్ 24 నుంచి 27 వరకూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కమ్మేస్తున్న పొగమంచు.. వణికిపోతున్న ప్రజలు..
తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం నుంచే పొగమంచు కమ్ముకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం, రాత్రి సమయాల్లో ఎక్కువగా చలి గాలులు వీస్తున్నాయి. సింగిల్ డిజిట్‌లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 11జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్‌లో మినిమమ్ టెంపరేచర్స్ నమోదు అయింది.
జిల్లాల్లో 8 నుంచి 9 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొమరం భీమ్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రేపు ఆదిలాబాద్‌లో 8.7డిగ్రీలు, సంగారెడ్డిలో 9.5డిగ్రీలు, కొమరం భీమ్‌లో 9.3డిగ్రీలు, నిర్మల్‌లో 9.9డిగ్రీలు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఉండాల్సిన దానికంటే 5, 6 డిగ్రీలు మైనస్‌లోకి మినిమమ్ టెంపరేచర్స్‌లోకి వెళ్లింది.
Also Read: దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి
రహదారులపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. దీంతో రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఉదయం పూట ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసింది. అలాగే చిన్న పిల్లలు, వృద్ధులు ఉదయం పూట ఇళ్ల నుంచి బయటి రావద్దు అని అధికారులు సూచించారు.