TTD : కశ్మీర్, పహల్గాం ఉగ్రదాడుల తర్వాత దేశవ్యాప్తంగా హైఅలర్ట్ నెలకొంది. టూరిస్టు ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, ఆలయాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ సెక్యూరిటీ పెంచారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటినుంచీ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉండటంతో ఏ చిన్ని లూప్ హోల్ లేకుండా ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగా.. తిరుమలకు రాకపోకలు సాగించే ట్యాక్సీ డ్రైవర్లకు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ అనేక సూచనలు చేశారు. భక్తులతో వ్యవహరించాల్సిన తీరు.. అనుమానాస్పద వస్తువులను గుర్తించడం.. వెంటనే స్పందించడం.. తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి 450 మంది వరకు టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు హాజరయ్యారు.
డ్రైవర్లే పోలీసులు, సైనికులు
వాహన డ్రైవర్లు కనబడని పోలీసులని.. ఒక్కో సందర్భంలో మీరిచ్చే చిన్న సమాచారమే… పెద్ద ఉపద్రవం నుంచి కాపాడవచ్చనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ.. ఒక సైనికుడులా పని చేయాలని అన్నారు.
అనుమానం వచ్చిన వెంటనే..
వాహన డ్రైవర్లు లైసెన్స్, గుర్తింపు కార్డు తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భక్తులతో మర్యాద పూర్వకంగా, బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిషేధిత వస్తువులు తిరుమలకు తీసుకురాకూడదని.. అలాంటి వస్తువులు ఎవరు తీసుకు వచ్చినా వెంటనే పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అలాగని భక్తులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
డయల్ 112..
వాహనంలో ఎక్కినవారు నేరస్తులు కానీ, దొంగలు కానీ, ఉగ్రవాదులు కానీ అయింటారని అనుమానం వస్తే.. వెంటనే డయల్ 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. తిరుమలలో ఎవరైన భక్తులు మిస్సింగ్ అయినట్లు తెలిస్తే.. డ్రైవర్ల వాట్సాప్ గ్రూపులో, పోలీసులకు షేర్ చేయాలన్నారు. తిరుమలలో శాంతిభద్రత అత్యంత ముఖ్యమని చెప్పారు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు.