Tension in Tadipatri: ఆయన తగ్గడు.. ఈయన నెగ్గడు అన్నట్టు తయారైంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేంటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా.. శాంతిభద్రతల సమస్యతో పోలీసులు ఆయన్ని అనుమతించలేదు. ఇవాళ ఉదయం పెద్దారెడ్డి పోలీసులకు తెలియకుండా తాడిపత్రికి వచ్చినట్లు సమాచారం. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా తాడిపత్రిలోని ఇంట్లోనే ఉన్నారు. నేతలిద్దరూ ఊళ్లోనే ఉండటంతో ఏం జరుగుతుందోనని తాడిపత్రిలో ఉత్కంఠ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
మాట్లాడితే మంటలు.. కేకేస్తే కొట్లాటలు
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి యంత్రాంగం పరిస్థితి. తాడిపత్రి నియోజకవర్గం అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మాట్లాడితే మంటలు, కేకేస్తే కొట్లాటలు అన్న రీతిలో అక్కడ రాజకీయాలు మారుతున్న కాలానికి విరుద్ధంగా .. ఫ్యాక్షన్ వాసనలతో నిండి ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణలలో ఎస్పీ, డివైఎస్పీలతో పాటు పోలీసు శాఖలో పలువురు అధికారులు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఘర్షణలతో రెండు వర్గాలకు చెందిన వందలాది మందిపై కేసు
ఎన్నికల ఘర్షణలతో రెండు వర్గాలకు చెందిన వందలాది మందిపై.. కేసులతో పాటు రౌడీ షీట్లు కూడా నమోదయ్యాయి . దాదాపు రెండు నెలలపాటు రెండు పార్టీల కార్యకర్తలు రిమాండ్ నిమిత్తం జైల్లోనే మగ్గారు. కార్యకర్తలంతా జైల్లో ఉండగానే కౌంటింగ్ పూర్తి కావడం, కూటమి అధికారంలోకి రావడం జైలుకు వెళ్లిన కార్యకర్తలకు బెయిల్ రావడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇదే కేసులో కొన్ని నెలల తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆయన కుమారులకు అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు
కానీ పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి.
హైకోర్టు ఆదేశాలు ఉన్నా శాంతిభద్రతల సమస్యతో..
ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు పట్టుకొని పెద్దారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను కలసి తాడిపత్రికి మీరు చెప్పినప్పుడు వెళ్తానని అనుమతి కోరారు. కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఊరుకునేది లేదని, అడుగుపెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అక్కడి వాతావరణం చూసిన పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే 2024 ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆయన పర్యటనకు బ్రేకులు వేశారు.
పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వని పోలీసులు
హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న తరువాత మొదటిసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా వరుసగా ఎంపీపీ ఎన్నికలు, రాప్తాడులో జంట హత్యలు కారణంగా చూపిస్తూ బందోబస్తు కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు. ఇక మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు జిల్లా పోలీసు అధికారులు అనుమతి కోరగా ఆ సమయంలో మహానాడు జరుగుతుందని అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ పర్యటన అంటూ మరోసారి అనుమతించలేదు.
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
ఆ క్రమంలో తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి పైగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు.
ఈ పరిస్థితిపై పెద్దారెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు
ఈ పరిస్థితిపై పెద్దారెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జేసీ ప్రభాకరరెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు అనుమతిచ్చినా తనను సొంత సెగ్మెంట్లో అడుగుపెట్టనీయక పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తాడిపత్రికి వెళ్లడం అసాధ్యమేనని నిర్వేదంగా మాట్లాడుతున్నారు.
ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే
ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ప్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకరరెడ్డి ఆందోళనలకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు. జేసీ ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చుని వచ్చి దర్పం ప్రదర్శించారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకరరెడ్డి ఎంత ఫైర్ బ్రాండో వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు. ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఇప్పుడాయన పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారంట. ఇలాంటి సిట్యుయేషన్‌లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదంట.
మరి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారా?
తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు మూడు నెలలు కావొస్తున్నా పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఫ్యాక్షన్ మొదలు పెడతానని జేసీ వర్గీయులకు పదేపదే వార్నింగులు ఇచ్చారు. ఇప్పుడు బేల చూపులు చూస్తూ మాట్లాడాల్సి వస్తోంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయంకృతాపరాధమే అంటున్నారు. చూడాలి మరి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారో? ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారో?