Anitha Fires on Jagan : ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై రచ్చ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు దిగజారిపోతూ.. నాయకులు, వారి కుటుంబ సభ్యులు సహా ఇంట్లోని ఆడవాళ్లపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్రారంభించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని ఆరెస్టులు చేస్తోంది. దాంతో.. మీడియా ముందుకు వచ్చిన జగన్.. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. మీకు అసలు పౌరుషం ఉందా.? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా.? అంటూ హోం మంత్రి అనిత.. జగన్ పై గట్టి కౌంటర్ అటాక్ చేశారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచే రాష్ట్రంలో సోషల్ మీడియా అదుపు తప్పిందన్న హోం మంత్రి.. అప్పట్లో ప్రతిపక్ష నాయకులు, వారి ఇళ్లల్లోని మహిళలపై ఎంత అసభ్యకరంగా మాట్లాడారో గుర్తుచేశారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు మహిళలపై చేసిన దురాగతాలే తనకు శాపాలై తగిలాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై నశించింది అంటూ జగన్ మాట్లాడడం పెద్ద జోక్ అన్న.. హోం మంత్రి అనిత, రాజకీయ లబ్ది కోసమే జగన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ హయాంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు వెంటిలేటర్ మీదకు వెళ్లాయన్నారు. అప్పటి పాలన కారణంగానే ఇప్పుడీ పరిస్థితులు అంటూ ఆరోపణలు చేశారు. జగన్ హయంలోనే గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిపోయాయని ఆరోపించిన హోం మంత్రి.. రాష్ట్రంలో నడిరోడ్లపై మహిళలను పొడిచి చంపిన ఘటనలను మరిచిపోయావా.? అంటూ ప్రశ్నించారు. బాధిత కుటుంబ సభ్యులను పరిశీలించేందుకు వెళ్లిన.. తనపై, లోకేష్ పై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు.
రాష్ట్రంలో సోషల్ మీడియాలో తనపై కొంత మంది పెట్టిన పోస్టులను చదివి వినిపించిన అనిత.. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతులు తిట్టడమా అని ప్రశ్నించారు. పరిధులు దాటి.. మహిళలు అన్న సంస్కారం లేకుండా ఎలాంటి పోస్టులు పెట్టారో చూడండి అంటూ.. కొన్ని పోస్టులను చూపించారు. వాటిని చదువుతుంటే తనకే ఆవేదన తన్నుకొస్తుంది అన్న వంగలపూడి అనిత.. ఇక మామూలు ఆడపిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో బూతులు తిడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న జగన్ కు.. వారి ఇంట్లో ఆడవారిని తిట్టినా పౌరుషం లేదని అన్నారు. ఏకంగా వైఎస్ విజయమ్మను విమర్శించినా, వైఎస్ షర్మిళ పుట్టుక గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అలాంటి మీకు.. ఇతర మహిళల అభిప్రాయాలు ఏం తెలుస్తాయని అన్నారు. వారినే కాదని.. జగన్ అండ చూసుకుని కొంతమంది… పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో పాటు.. వారి ఇళ్లల్లోని వారిపైనా ఇష్టారీతిన కామెంట్లు, పోస్టులు పెట్టారని.. వారిని విడిచిపెట్టమని చెబుతున్నారా.? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కూటమి మధ్య మంచి సఖ్యత ఉందన్న హోం మంత్రి.. రెండు రోజుల క్రితం ఏకంగా తన పేరుతోనే ఓ సోషల్ మీడియా పేజీని క్రియేట్ చేసి, జనసేనాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అన్నారు. హోం మంత్రి అంటేనే భయం లేకుండా.. తప్పుడు పేజీని క్రియేట్ చేసిన వాళ్లను విడిచిపెట్టమని చెబుతున్నారా.? అని జగన్ ను ప్రశ్నించారు.
Also Read : వాళ్లను వదిలిపెట్టనంటున్న చంద్రబాబు.. షర్మిళ మద్దతు.. కుదరదంటున్న జగన్
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న హోం మంత్రి.. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినా, బూతులు తిడుతూ పోస్టులు పెట్టినా.. వారిపై తక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. త్వరలోనే ఇలాంటి వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని… పవన్, చంద్రబాబు నిర్ణయించినట్లు వెల్లడించారు. జగన్ అభిమానుల పేరుతో కొంత మంది సోషల్ మీడియాను.. ఉగ్రవాదుల్లా వినియోగిస్తున్నారని ఆగ్రహించారు. ప్రశ్నిస్తే కేసులు పెటుతున్నరంటున్న జగన్.. తన హయంలోని ఘటనల్ని మర్చిపోయారా అంటూ.. అప్పటి కొన్ని ఘటనల్ని గుర్తు చేశారు.