AP Politics: ఒకే రోజు మూడు పార్టీల నేతలు ఒకే విషయంపై గుర్రుమన్నారు. ఒకరేమో వదిలి పెట్టనంటూ హెచ్చరించారు. మరొకరేమో వారిపైనేనా మీ ప్రతాపమన్నారు. మరొకరయితే ఆ సైకోల తాట తీయండంటూ.. కోరారు. ఇంతకు ఈ ముగ్గురు ఎవరో కాదు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, వైఎస్ షర్మిళ. ఈ ముగ్గురిలో ఇద్దరు మాత్రం విరుచుకుపడింది సోషల్ మీడియా ట్రోలర్స్ పై కాగా, ఒకరేమో వారికి మద్దతుగా మాట్లాడడం విశేషం. ట్రోలర్స్ కి సంఘీభావం తెలిపిన నేత ఎవరో కాదు మాజీ సీఎం జగన్.
ఇటీవల సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఎఫెక్ట్ ఊహించని రీతిలో ఉంది. ప్రధానంగా మహిళలను టార్గెట్ చేస్తూ.. అసభ్యకర కామెంట్స్ చేయడం, మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేయడం ఇదే పనిగా ఎంచుకున్నారు ట్రోలర్స్. అందులో రాజకీయ పార్టీల మహిళా నేతల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఆధారంగా తప్పులను ప్రశ్నించడం వరకు ఒకే గానీ, హద్దు మీరి కామెంట్స్, వ్యక్తిగత దూషణల పర్వం అధికం కాగా ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి.
ఏపీ ఎన్నికల సమయంలో ఈ ట్రోలింగ్స్ హద్దులు దాటాయన్నది కూటమి ప్రభుత్వం వాదన. సీఎంను లేపేస్తాం.. ఎవరినైనా చిటికెలో చంపేస్తాం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగడంపై కూటమి సీరియస్ అయింది. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమార్తెలను కూడా ఊహించని రీతిలో ట్రోలింగ్స్ సాగడం, మహిళా నేతలు అయితే ట్రోలింగ్స్ దెబ్బకు అస్సలు నోరెత్తని పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలర్స్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఘాటుగానే విమర్శించారు.
ఈరోజు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛనా, అసత్యాలు, అశ్లీల పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛనా అంటూ ప్రశ్నిస్తూ, సోషల్ మీడియాలో సైకోలు పెట్టే పోస్టులకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారని, ఆడబిడ్డల కన్నీటి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తాట తీస్తాం అనే రేంజ్ లో సీఎం వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రసంగం ముగియగానే జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ, ఏకంగా డీజీపీ గారూ.. ప్రభుత్వాలు మారుతాయి.. కూటమి శాశ్వతం కాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగక పోస్ట్ లు ఇలాగేగా పెట్టిందంటూ.. ఇందులో తప్పేముందని, తన తల్లి సంతకం ఫోర్జరీ అంటూ ప్రచారం చేసిన టీడీపీ సోషల్ మీడియాపై కేసులు నమోదు చేశారా అంటూ ప్రశ్నించారు.
తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా స్పందించారు. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని, సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒకరిగా చెప్పుకున్నారు షర్మిళ.
అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టి.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలని కోరారు. తన మీద, విజయమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారన్నారు. తన ఇంటి పేరు మార్చి కొందరు శునకానందం పొందారంటూ.. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టినట్లు, అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు షర్మిళ ప్రకటన విడుదల చేశారు.
ఇలా ఒకే రోజు మూడు పార్టీలకు చెందిన నేతలు, ఒకే అంశానికి సంబంధించి స్పందించగా ఇందులో భిన్న స్వరాలు వినిపించాయి. ఏదిఏమైనా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేసిన బ్యాచ్ కి మాత్రం ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారని పొలిటికల్ టాక్.