Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం మరోసారి జూన్ 2025 నుండి అమలులోకి రానుంది. ఈ పథకం ద్వారా రైతులకు వార్షికంగా రూ.20,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం విశేషం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రూ.6000 అందుతున్నా, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనం కలిపి రైతులకు అందజేస్తుండడంతో ఈ పథకానికి ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. ఇది కేవలం ఆర్థిక సాయం కాదు, రైతుల భద్రతకు సంబంధించిన ప్రధాన అంశం.
సన్నకారు రైతులకు వరం..
చిన్న, సన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ పథకం వ్యవసాయరంగానికి కొత్త శక్తిని నూరిపోసేలా ఉంది. దీనికి అర్హులయ్యే రైతులు 5 ఎకరాల లోపు భూమిని కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల పైబడి ఉండాలి. ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా తప్పనిసరి. భూమి పాసుబుక్ లేదా సంబంధిత ఆధారాలతో కూడిన పత్రాలు సమర్పించాలి. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే, అయితే కౌలు కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. ఇది కౌలుదారులకు పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.
వీరందరూ అనర్హులే..
అన్నదాత సుఖీభవ పథకంలో అర్హతలు సాధారణ రైతులకే కాకుండా, పేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఈ పథకం నుండి లబ్ది పొందలేరు. ఆదాయపు పన్ను చెల్లించినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులు, రూ.10 వేల పైగా పింఛన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు. ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రైతులు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించాలి. అందులో ఆధార్ కార్డు, భూమి పాసుబుక్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, రైతు ఫోటో, భూమి సర్వే నంబర్లు ముఖ్యమైనవి. ఈ పత్రాలతో రైతులు తమ గ్రామ రైతుసేవా కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు తర్వాత..
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, సంబంధిత వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా ధృవీకరిస్తారు. అనంతరం MAO లేదా MRO ఆమోదించిన తర్వాత రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వ సహాయం జమ అవుతుంది. ప్రతి దశలో పరిశీలనను కఠినంగా నిర్వహించడం ద్వారా అనర్హుల దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
Also Read: Poonam Kaur: రాజకీయాల్లోకి పూనమ్ కౌర్? వరుస భేటీలు అందుకేనా?
ఇదే సమయంలో అబద్ధపు సమాచారం ఆధారంగా తప్పుడు లబ్ధిదారుల ఎంపిక కాకుండా సాంకేతికంగా మరింత పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు ఏదైనా సందేహం ఉంటే, రైతుసేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి సాయం పొందవచ్చు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా పథకం వివరాలను తెలుసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులవుతారు. ప్రభుత్వం వారి ఖాతాల్లో నేరుగా సాయం జమ చేయడం ద్వారా రైతులకు మధ్యలో వారధులు ఉండాల్సిన పని లేదు. ఇది రైతుల ఆకాంక్షలకు న్యాయం చేసే పథకంగా నిలుస్తోంది. అందుకే అప్లై చేసే సమయంలో అర్హత ప్రామాణికం కాబట్టి అర్హత లేకుంటే, అప్లై చేయడం దండగే.