Smart Watch Tips: స్మార్ట్ వాచ్ క్రేజ్ మామూలుగా లేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చేతికి స్మార్ట్ వాచ్ ధరించే రోజులివి. అయితే స్మార్ట్ వాచ్ చూసేందుకు ఎంత స్టైలిష్ గా ఉంటుందో, అంత ప్రమాదం పొంచి ఉంటుందట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు నిపుణులు. ఇంతకు స్మార్ట్ వాచ్ లు పేలడానికి గల కారణాలు తెలుసుకోవాల్సిందే. అప్పుడే మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలుగుతాం.
గతంలో వాడే వాచ్ లు వేరు. ఇప్పట్లో మనం వాడే వాచ్ లు వేరు. కాలం మారింది. ఆధునిక కాలం కావడంతో మనం వాడే వాచ్ లు కూడా కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ వాచ్ లను చూస్తే చాలు, కొనుగోలు చేయాలనే ఆశ కలగకమానదు. ప్రధానంగా స్మార్ట్ వాచ్ లు చూస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆకర్షితులవ్వాల్సిందే. ఒక్క స్మార్ట్ వాచ్ చేతిలో ఉంటే చాలు, మొబైల్ తో సమానంగా పని చేసే మోడల్స్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్. ఈ సీజన్ లో స్మార్ట్ వాచ్ ధరించే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకుంటే పెను ప్రమాదమే పొంచి ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
స్మార్ట్ వాచ్ పేలేందుకు గల కారణాలు..
స్మార్ట్ వాచ్ లు పేలే అవకాశాలు ఉన్న సంధర్భాలు ఇలా ఉన్నాయి. చాలా వరకు బ్యాటరీ సమస్యలు, ఓవర్ హీట్ కావడం, నకిలీ ఉత్పత్తులను వాడడం వంటి వాటితో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. చీప్ లేదా నకిలీ బ్రాండ్‌లు, స్మార్ట్ వాచ్ లకు నాణ్యమైన బ్యాటరీలు ఉపయోగించకపోతే ప్రమాదమే. ఓవర్‌ఛార్జింగ్ అలాగే కంపెనీ ఛార్జింగ్ కాకుండా ఇతర ఛార్జింగ్స్ వాడడం, వాచ్ పడిపోయి లోపల బ్యాటరీకి డ్యామేజ్ అయినా పేలే అవకాశం కూడా ఉంటుందట. అంతేకాదు ఎక్కువ వేడి తగిలిన సమయంలో బ్యాటరీ పేలే ప్రమాదం పొంచి ఉంది. గంటల తరబడి ఎండలో వాచ్ ఉంచినట్లయితే వాచ్ లోపల ఉష్ణోగ్రత పెరిగి, బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు ఇవే..
నకిలీ బ్రాండ్స్ వాచెస్ కు దూరంగా ఉండాలి. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడండి. వాచ్ వేడి అవుతుంటే వెంటనే తీసేసి చార్జింగ్ ఆపాలి. డ్యామేజ్ అయిన బ్యాటరీలు అంటే వాచ్ పరిమాణం పెరిగితే అస్సలు వాడవద్దు. సాధారణంగా ఎండల వల్ల మాత్రమే స్మార్ట్‌వాచ్‌లు పేలిపోవడం చాలా అరుదు, కానీ తీవ్రమైన వేడి పరిస్థితుల్లో అయితే పేలే ప్రమాదం కొంత మేర ఉంటుంది, ప్రత్యేకంగా నకిలీ లేదా తక్కువ నాణ్యత కలిగిన వాచ్‌లకు. అందుకే బ్రాండెడ్ వాచ్ లను కొనుగోలు చేయడం ఉత్తమం.
Also Read: Face Pack For Open Pores: ఈ ఫేస్ ప్యాక్స్ వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం
చివరగా ఒక మాట..
సాధారణంగా స్మార్ట్ వాచ్ లు పేలే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, ప్రస్తుతం స్మార్ట్ వాచ్ వాడకం పెరిగినందున, డూప్లికేట్ వాచెస్ ఎక్కువగా మార్కెట్ లోకి వచ్చాయన్నారు. అందుకే బ్రాండ్ చెక్ చేసి మరీ వాచ్ కొనుగోలు చేస్తే ఏ ప్రమాదం ఉండదని నిపుణుల అభిప్రాయం. మీరు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.