Jagan: పులివెందుల కోట కూలిపోతుందా? మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలే కారణమా? పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను రద్దు చేయాలని జగన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఓటమి ఖాయమైందని ముందే తెలిసిపోయిందా? ఏపీలో వైసీపీ శకం ముగిసినట్టేనా? ఆ పార్టీ ఇక బతకడం కష్టమేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెత వైసీపీ అధినేత జగన్ అతికినట్టు సరిపోతుంది. 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 80 శాతం ఏకగ్రీవాలకు తెరలేపారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేసే అర్హత కోల్పోయారు. కానీ రోజులు ఒకేలా ఉండవని అప్పటి పాలకులు తెలుసుకోలేకపోయారు.
సీన్ రివర్స్ అయ్యింది.. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. బలమైన కోటలు సైతం నేలకూలాయి. చివరకు ఆ సెగ ఇప్పుడు పులివెందులను తాకింది. మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. చెదురు మదురు సంఘటనల మధ్య పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగింది.
ఎప్పటి మాదిరిగా అధికార-విపక్షాల మధ్య ఆరోపణలు, ఆపై విమర్శలు మొదలయ్యాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుతో ఓటమి ఖాయమైందని వైసీపీ ముందుగా డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉప ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చాలా విషయాలు ప్రస్తావించారు.
ALSO READ: వివేకానంద హత్య కేసు విచారణ కీలక మలుపు
ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగాయి జగన్. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా సొంతం చేసుకునేందుకు గూండాల మాదిరిగా సీఎం చంద్రబాబు అరాచకాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నది జగన్ మాట.
తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన మంగళవారం రోజుని బ్లాక్ డేగా వర్ణించారు. ఈ నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నిక జరిపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు ఒట్టి మాటలేనని తేల్చేశారు. వ్యవస్థలు కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని రుజువైందన్నారు.
జగన్ మాటలను గమనించిన ప్రజలు, రాజకీయ పార్టీలు నవ్వుకుంటున్నారు. ఆనాడు వైసీపీ పాలనలో ఈ మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. మీరు చేస్తే రైట్.. మిగతావారు చేస్తే తప్పా? అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ పడిపోతున్నాయి. జరిగిన.. జరగబోయే పరిణామాలను వైసీపీ నేతలు క్షుణ్నంగా గమనిస్తున్నారు.
ఏపీలో వైసీపీ శకం ముగిసినట్టేనని అంతర్గతంగా నేతలు చర్చించుకోవడం మొదలైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, లేకుంటే తమ రాజకీయ భవిష్యత్తు మునిగిపోతుందని కొందరు నేతలు చర్చించుకోవడం మొదలైంది. మరి ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ తేరుకుంటారా? ఆయన ఆలోచన తీరు మార్చుకుని, ప్రజలతో మమేకం అవుతారా? అనేది చూడాలి.
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/Qky1FZjeQA
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025