Jagan Mohan Reddy on AP Jobs:ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు కావాలన్న యువతపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న యువతపై కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
కాకినాడలో జరిగిన ఆందోళనకు సంబంధించి శ్యామ్, టి. రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు మరో 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.వీరంతా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ నిరసన చేపట్టడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఉద్యోగాల కోసం డిమాండ్ చేయడం నేరం అయిందా అని ప్రశ్నించారు.
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు యువతకు ఇచ్చిన హామీలను కూడా జగన్ గుర్తు చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని, హామీ చేసిన భృతి అమలు కాకపోవడంతో ఒక్కో ఏడాది వేల కోట్ల రూపాయల భారం యువతకు నష్టంగా మారుతోందని విమర్శించారు.ఉద్యోగం కోసం చదువుకుని, పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక అనేక మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు, స్టడీ రూమ్‌లు, పరీక్షల కోసం చేసే ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
మెగా డీఎస్సీ ఉద్యోగాల్లో అవినీతి
ఇలాంటి పరిస్థితుల్లో వారి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడం సరికాదని విమర్శించారు.మెగా డీఎస్సీ ఉద్యోగాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న అభ్యర్థులను అణచివేయకుండా పారదర్శకత తీసుకురావాలని కోరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో యువతకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని ముఖ్యంగా పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.ఎన్నో ఏళ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు ఏజ్ అంశంలో అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటి నోటిఫికేషన్ తేదీలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
యువత తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం
ఉద్యోగాలు ఎక్కడ..అని అడిగిన యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ,అడిగిన వారిని కేసులతో భయపెట్టడం సమస్యకు పరిష్కారం కాదని, నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ:బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను
ఇక కాకినాడలో నమోదైన కేసులను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఉపసంహరించుకోవాలని, మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని తెలిపారు.ఉద్యోగాల కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి తమ పార్టీ అండగా ఉంటుందని,ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగ యువత తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.
Cases were…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026