Amaravati: చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగాయి మాజీ సీఎం జగన్. కేవలం మూడు అంశాలను ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు.
బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన మాదేనని క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ పాలనలో 176 జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. బీసీల 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. కోర్టులు తోసిపుచ్చినా బీసీలను రాజకీయంగా ప్రోత్సాహం ఇచ్చామన్నారు.
34 శాతం కంటే ఎక్కువగా ఇచ్చామన్నారు. కేబినెట్‌లో 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే ఉండేవారని పాత విషయాలు తెరపైకి తెచ్చారు. ఆ లెక్కన 45 శాతం బీసీలకు ఇచ్చామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చామన్నారు. 50 శాతం మించి రిజర్వేషన్లు దాటకూడదని కోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
అదే సమయంలో ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. నాగార్జునసాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు ఉందని, అది ఏపీకి చెందినది చెప్పారు. ఈ ప్రాజెక్టుకు లెఫ్ట్-రైట్ లిఫ్ట్‌ల కింద తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్నా, సీఎం చంద్రబాబు సరిగా సరిగా లేదన్నారు.
-52 శాతం వర్షాపాతం లోటు ఉందన్న జగన్, కుంభకర్ణుడి మాదిరిగా నిద్ర పోతున్నట్టు నటిస్తూ రైతులకు మేలు చేయలేదని దుయ్యబట్టారు. జూన్ నుంచి ఆగస్టు వరకు 394 ఎంఎం వర్షం పడాల్సి ఉండగా, కేవలం 189ఎంఎం వర్షం నమోదు అయ్యిందన్నారు. 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. ఓవరాల్‌గా 28 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని, అందులో రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఉన్నాయన్నారు.
ALSO READ: కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్.. జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్టులంటూ కొత్త పల్లవి
చంద్రబాబు ప్రభుత్వం రైతులు, రైతు కూలీలను ఆదుకోవట్లేదని విమర్శించారు మాజీ సీఎం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 2023లో కోటి 18 లక్షల బీమా దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కూటమి పాలనలో అవి 40 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కనీసం 35 శాతం పంటలు బీమా పరిధిలోకి రావట్లేదని, జులైలో ప్రభుత్వం కేంద్రానికి బీమా నిధులు చెల్లించకపోవడంతో రైతులకు 3 వేల కోట్ల నష్టం వచ్చిందని కొత్త విషయాలు బయటపెట్టారు. గతేడాది అక్టోబర్‌లో మొంథా తుపాను వస్తే రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఈ-క్రాప్, రైతు భరోసా కేంద్రాలు నాశనం చేశారని, ఇప్పుడు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. బాబు పాలన కంటే మాదే బాగుందని చెప్పే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్.