Indian Currency: సగటు మనిషి తన రోజువారీ జీవితంలో ఏదోక రూపంలో డబ్బును ఖర్చు చేస్తూనే ఉంటారు. కూరగాయల కొనడం దగ్గర నుంచి క్యాబ్ కు ఛార్జీలు చెల్లించడం వరకూ నోట్లను, నాణాలను ఉపయోగిస్తుంటారు. అయితే మన చేతికి వచ్చే ఈ నోట్లు, నాణేలు ఎక్కడ తయారవుతాయి? మార్కెట్లోకి ఎలా వస్తాయనేది ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆర్థిక వ్యవస్థను నడిపించే కరెన్సీ తయారీ వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉందని ఊహించారా? వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మన దేశ అధికారిక కరెన్సీ అయిన ‘రూపాయి’ (INR)కి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో ఒక రూపాయిని 100 పైసలుగా లెక్కిస్తారు. అయితే రూపాయికి ఉన్న ‘₹’ సింబల్ ను.. దేవనాగరి అక్షరం ‘ర’, లాటిన్ అక్షరం ‘R’ల సమ్మేళనంతో రూపొందించారు. ప్రపంచంలోని ప్రధాన కరెన్సీల సరసన ఈ చిహ్నానికి ప్రత్యేక స్థానం ఉంది.
దేశంలో నాణేల తయారీ (మింటింగ్) బాధ్యతలను ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (SPMCIL) నిర్వహిస్తుంది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలలో ఉన్న నాలుగు మింట్స్ (నాణేల తయారీ కేంద్రాలు)లో ఇవి తయారవుతాయి. అయితే అక్కడ తయారైన రూ.1, రూ.2, రూ.5. రూ.10, రూ.20 నాణేలు వెంటనే మార్కెట్లోకి రావు. ఆర్బీఐ యాక్ట్ నిబంధనల ప్రకారం.. మింట్స్ నుంచి సేకరించిన నాణేలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే క్రమపద్దతిలో ప్రజల్లోకి విడుదల చేస్తుంది.
నోట్ల విషయానికి వస్తే.. దేశ వ్యాప్తంగా నాలుగు కరెన్సీ ప్రెస్‌లలో మాత్రమే వీటి ముద్రణ జరుగుతుంది. నాశిక్, దేవాస్‌లలో ఉన్న రెండు ప్రెస్‌లను ‘SPMCIL’ నిర్వహిస్తుండగా.. మైసూర్, సాల్బోనిలలోని మిగిలిన రెండు ప్రెస్‌లను ఆర్బీఐకి చెందిన ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్’ (BRBNMPL) పర్యవేక్షిస్తోంది. దేశంలో ఎంత కరెన్సీ అవసరమవుతుందో అంచనా వేసి దానికి తగినట్లుగా ఆర్బీఐ ఈ ముద్రణ కేంద్రాలకు ఆర్డర్లు ఇస్తుంది.
Also Read: అమ్మబాబోయ్.. రూ.200 లోపు ఇన్ని మంచి ప్లాన్స్ ఆ.. BSNLకు సెల్యూట్ చేయాల్సిందే!
దేశంలో నోట్లను జారీ చేసే పూర్తి అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంది. నోట్ల డిజైన్, పరిమాణం, రంగు వంటి అంశాలను ఆర్బీఐ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. చలామణిలో ఉన్న పాత, చిరిగిపోయిన నోట్లను వెనక్కి తీసుకొని.. వాటి స్థానంలో కొత్త నోట్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఆర్బీఐ ‘క్లీన్ నోట్ పాలసీ’ని అమలు చేస్తూ ఉంటుంది. మరోవైపు నాణేలకు సంబంధించిన బాధ్యత మాత్రం ‘కాయినేజ్ యాక్ట్ – 2011’ ప్రకారం కేంద్రానికే ఉంది. వాటి తయారీ, డిజైన్ ను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిని ప్రజలకు పంపిణీ చేసే బాధ్యతను మాత్రం మళ్లీ ఆర్బీఐనే చూసుకుంటుందని చెప్పవచ్చు.
Also Read: జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!