Stolen Bodies: సాధారణంగా ఒక వ్యక్తి మరణిస్తే అతడి అధ్యాయం ముగిసిపోయిందని అంతా భావిస్తుంటారు. అయితే ప్రముఖులు, సెలబ్రిటీలకు మాత్రం ఇందులో కాస్త మినహాయింపు ఉంటుంది. వారు మరణించినప్పటికీ వారు చేసిన సినిమాలు, ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి వారిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇందుకు భిన్నంగా చనిపోయిన వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. వారి భౌతికకాయాలు ఏకంగా దోపిడికి గురయ్యాయి. అలాంటి ప్రముఖుల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆంగ్ల భాషలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాటక రచయిత, కవి షేక్ స్పియర్ 1616లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన్ను స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్‌లో సమాధి చేయగా.. కొన్ని శతాబ్దాల తర్వాత ఆయన పుర్రె చోరీకి గురైనట్లు ప్రచారం మెుదలైంది. దీంతో 2016లో పరిశోధకులు ఆయన సమాధిని పరిశీలించగా.. నిజంగానే పుర్రె భాగం కనిపించలేదు.
అర్జెంటీనా మాజీ ప్రథమ మహిళ ఎవా పెరాన్ 1952లో క్యాన్సర్‌తో మరణించగా.. ఆమె భౌతిక కాయం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆమె భౌతిక కాయం ప్రజలను ఐక్యం చేస్తుందనే భయంతో మిలిటరీ దానిని రహస్యంగా ఇటలీకి తరలించి వేరే పేరుతో పాతిపెట్టింది. చివరకు 1971లో ఆమె భౌతిక కాయాన్ని గుర్తించి.. 1976లో తిరిగి అర్జెంటీనాలో పాతిపెట్టారు. మరోవైపు ఆమె భర్త అర్జెంటీనా మాజీ అధ్యక్షుడు జువాన్ పెరాన్ 1974లో మరణించగా 1987లో దొంగలు ఆయన సమాధిని తవ్వి రెండు చేతులను నరికి పట్టుకెళ్లారు. మిలియన్ల డాలర్ల డబ్బును డిమాండ్ చేసినప్పటికీ ఆ చేతులు ఇప్పటివరకు లభించలేదు.
శాంటా క్లాజ్ పాత్రకు ప్రేరణగా నిలిచిన సెయింట్ నికోలస్ 4వ శతాబ్దంలో మరణించారు. ఆయనను టర్కీ ప్రాంతంలో సమాధి చేశారు. అయితే 1087లో ఇటలీకి చెందిన కొందరు నావికులు ఆయన సమాధిని పగలగొట్టి అవశేషాలను దొంగిలించారు. వాటిని రక్షించడానికే తీసుకెళ్తున్నామని చెప్పినప్పటికీ అది అపహరణగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ అవశేషాలు ఇటలీలోని బాసిలికా డి సాన్ నికోలాలో ఉన్నాయి.
ఇటాలియన్ మహాకవి డాంటే అలిగిరి 1321లో మరణించగా రవెన్నాలో సమాధి చేశారు. కానీ ఫ్లోరెన్స్ నగరం ఆయన అవశేషాల కోసం ప్రయత్నించడంతో రవెన్నాలోని ఫ్రాన్సిస్కాన్ సన్యాసులు ఆ ఎముకలను రహస్యంగా దాచిపెట్టారు. శతాబ్దాల పాటు దాగి ఉన్న ఆ ఎముకలు 1865లో భవన నిర్మాణ పనుల్లో అనుకోకుండా బయటపడ్డాయి.
హాస్య నటుడు చార్లీ చాప్లిన్ 1977 డిసెంబర్‌లో మరణించారు. అయితే 2 నెలలకే ఇద్దరు వ్యక్తులు ఆయన సమాధిని తవ్వి బాడీని తీసుకెళ్లారు. ఆయన భార్యకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే మరుసటి ఏడాది ఓ జొన్న చేనులో చాప్లిన్ శవాన్ని స్వాధీనం చేసుకుని.. పోలీసులు దొంగలను అరెస్టు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు.. చార్లీ సమాధిని కాంక్రీట్‌తో మూసివేశారు.
18వ శతాబ్దంలో 7 అడుగుల 7 అంగుళాల ఎత్తుతో ‘ఐరిష్ జెయింట్’గా పేరుగాంచిన చార్లెస్ బైర్న్.. తన మరణానంతరం శరీరాన్ని వైద్య పరిశోధనలకు ఇవ్వకూడదని సముద్రంలో కలపమని కోరారు. కానీ ఆయన మరణించాక శవాలను పరీక్షించేవారు రహస్యంగా ఆయన మృతదేహాన్ని కొనుగోలు చేసి.. పాటిపెట్టిన సమాధి పెట్టెలో రాళ్లు నింపి మోసం చేశారు. అలా ఆయన అస్థిపంజరం రెండు శతాబ్దాల పాటు లండన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం గమనార్హం.
సైప్రస్ మాజీ అధ్యక్షుడు తస్సోస్ పాపడోపౌలోస్ సమాధిని 2009లో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి శవాన్ని ఎత్తుకెళ్లారు. అయితే కొన్ని నెలల తర్వాత అది తిరిగి లభించింది. అలాగే ఇటాలియన్ టీవీ ప్రెజెంటర్ మైక్ బొన్జియోర్నో శవాన్ని 2011లో అపహరించి.. డబ్బుల కోసం బెదిరించారు. 77 రోజుల తర్వాత ఆయన భౌతిక కాయం ఒక పొలంలో బయటపడింది.
Also Read: నాణేలు, నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? RBI, కేంద్రం పాత్ర ఏంటి? మైండ్ బ్లోయింగ్ నిజాలు!
మెక్సికన్ విప్లవకారుడు పాంచో విల్లా, ప్రసిద్ధ సంగీతకారుడు జోసెఫ్ హేడన్, స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో డి గోయా, అలాగే హారర్ మూవీ ‘నోస్ఫెరాటు’ దర్శకుడు ఎఫ్.డబ్ల్యూ. ముర్నౌ పుర్రెలను సమాధుల నుంచి దోపిడికి గురయ్యాయి. వీటిలో బ్లాక్ మ్యాజిక్, పరిశోధనలకు చోరీ కాగా.. మరికొన్ని ఇప్పటికీ బయటపడలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొని మరణించిన మాతా హరి ప్రసిద్ధ పుర్రె కూడా మ్యూజియం నుండి మాయమై ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
Also Read: అమ్మబాబోయ్.. రూ.200 లోపు ఇన్ని మంచి ప్లాన్స్ ఆ.. BSNLకు సెల్యూట్ చేయాల్సిందే!