Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. జగన్ పెద్దమ్మ సుశీలమ్మ బుధవారం రాత్రి మరణించారు. ఆమె వయస్సు 85 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పులివెందులలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే గురువారం పులివెందులకు పయనం అయ్యారు మాజీ సీఎం.
జగన్ ఫ్యామిలీకి 2025 ఏడాది అస్సలు కలిసి రాలేదు. జనవరిలో జగన్ బంధువు వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూశారు. సరిగ్గా రెండు నెలల తర్వాత జగన్ పెద్దమ్మ సుశీలమ్మ పులివెందులలో మరణించారు. దీంతో జగన్ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఏడాదిలో దగ్గరివాళ్లను కోల్పోయారు జగన్‌బాబు. పులివెందుల వెళ్లినప్పుడు రెండు నెలల కిందట సుశీలమ్మ దగ్గరకు వెళ్లారు జగన్. అప్పుడు ఆమె ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
సుశీలమ్మ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నయ్య ఆనంద్‌రెడ్డి భార్య. ఆనంద్ రెడ్డి గతంలో చనిపోయారు. ఇప్పుడు సుశీలమ్మ మరణం ఆ కుటుంబానికి మరింత దుఃఖాన్ని మిగిల్చింది. ఆమె అంత్యక్రియలు గురువారం పులివెందులలో జరగనున్నాయి. పెద్దమ్మ మరణ వార్త తెలియగానే తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు.
రెండురోజుల కిందట బెంగళూరు నుంచి పులివెందుల వెళ్లారు జగన్. అకాల వర్షాలతో నష్టపోయిన అరటి రైతులను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ: విశాఖలో లులూ మాల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం