Jagan Reaction: ఏపీలోని నకిలీ మద్యం కేసులో డొంక కదిలింది. ఈ కేసులో తొలిసారి రాజకీయ నేత అరెస్ట్ అయ్యారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్ట్ అని అన్నారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లాలకు చెందిన ఆ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ఓ ఫీలర్ చక్కర్లు కొడుతోంది.
నకిలీ మద్య కేసులో అరెస్టుల పర్వం
నకిలీ మద్యం, లిక్కర్ వ్యవహారం వైసీపీని ఓ కుదుపు కుదిపేస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అరెస్టు అయ్యారు. కొందరు బెయిల్‌పై ఉన్నారు. మరికొందరు బయటకు రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే నకిలీ మద్యం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు తీగ లాగితే డొంక కదిలింది. వెలుగు చూసిన విషయాలతో చంద్రబాబు సర్కార్ సిట్ వేసింది.
ప్రస్తుతం సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆనాడు కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి కృష్ణా, చిత్తూరు జిల్లాల నేతలున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వారిలో కొందరు ఎమ్మెల్యేలుగా ఉండగా, చాలామంది మాజీలుగా ఉన్నారు. రేపోమాపో వారిని అరెస్టు చేసే అవకాశమున్నట్లు అందులోని సారాంశం. ఈ లెక్కన వరుసగా వైసీపీ నేతలు అరెస్టు కావడం ఖాయం?
జోగి అరెస్టుపై జగన్ రియాక్షన్
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టుపై మాజీ సీఎం జగన్, ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు.‘ మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడి అడ్డంగా దొరికిపోయారని, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని’ రాసుకొచ్చారు. ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అని, ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
18 నెలలుగా మీ ప్రభుత్వం నడుస్తోందని, పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాం లోనిదంటూ కూటమి ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేశారు. పట్టుబడ్డవారిలో టీడీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీకు-మీ కొడుకు-మంత్రులు-ఎమ్మెల్యేలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని గుర్తు చేశారు.
ALSO READ: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. కొత్తగా 21 మందికి పోస్టింగ్‌లు
శనివారం కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజు అరెస్టుకు దిగారంటే, మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతుందన్నారు.
కేసులో మీ ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు? ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. సిట్ మీరు ఏం చెబితే అదే చేస్తోందన్నారు. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలమని రాసుకొచ్చారు. మొత్తానికి నకిలీ మద్యంలోనూ చాలామంది నేతలు అరెస్టయ్యే ఛాన్స్ ఉందన్నమాట.
.@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025