వల్లభనేని వంశీ బెయిల్ పై విడుదలైనా ఆయనపై ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అసలా ట్రోలింగ్ కి అసలు కారణం వైఎస్ జగనేనని చెప్పాలి. ఆయన్ను అందగాడు అంటూ ప్రొజెక్ట్ చేసిమరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ ని చేశారు జగన్. అయితే ఇప్పుడా అందగాడు బెయిల్ పై విడుదలై జగన్ ని కలిశారు. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, వంశీ అసలు వయసు బయటపడేలా తెల్లజుట్టు కనపడుతోంది. దాదాపు సగం బరువు తగ్గి పీలగా మారారు. 138రోజులు జైలులో ఉండటంతో మొహం కళ తప్పింది. అలా ఉన్న వంశీని చూసి జగన్ నిజంగానే షాకయ్యారు. తనని కలవడానికి వచ్చిన వంశీని కాసేపు ఎగాదిగా చూశారు, ఆ తర్వాత చైర్ లో కూర్చోమని చెప్పారు. వంశీ, ఆయన భార్య పంకజశ్రీతో కాసేపు మాట్లాడారు జగన్. అయితే ఈ మీటింగ్ కూడా ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. సౌండ్ లేకుండా వారు కలసిన వీడియోని వైసీపీ బయటకు వదిలింది. అయితే ఆ వీడియోకి సోషల్ మీడియాలో డబ్బింగ్ చెబుతున్నారు నెటిజన్లు. అందగాడివి.. ఇలా అయిపోయావేంటీ? అంటూ వంశీని చూసిన జగన్ రియాక్ట్ అయ్యారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిని కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి దంపతులు
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో 140 రోజులు అక్రమ నిర్భందంలో ఉండి.. బెయిల్పై నిన్న విడుదలైన వంశీ గారు pic.twitter.com/LIHscPE8G2
— YSR Congress Party (@YSRCParty) July 3, 2025
చంద్రబాబు, లోకేష్ పై ఎవరెన్ని ఎక్కువ విమర్శలు చేస్తే వారిని జగన్ అంతగా దగ్గరకు తీసేవారనే ప్రచారం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా కొడాలి నాని, పేర్ని నాని అందుకే ఘాటు విమర్శలు చేసేవారు. ఆ తర్వాత ఆ లిస్ట్ లో వంశీ చేరారు. అయితే వంశీ మరింత వ్యక్తిగత విమర్శలు చేయడం ఇక్కడ సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రెస్ మీట్లో కంటతడి పెట్టడానికి కూడా వంశీయే కారణం అంటారు. అప్పట్లో లోకేష్ కూడా వంశీని వదిలిపెట్టేది లేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే వంశీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. గతంలో నమోదైన కేసుల్ని వైసీపీ హయాంలో లైట్ తీసుకోగా, కూటమి విచారణ తిరిగి మొదలు పెట్టింది. దీంతో వంశీ జైలుకెళ్లాల్సిన పరిస్థితి. వంశీకి కనీసం రిమాండ్ కూడా పడకుండానే బెయిల్ పై బయటకు వస్తారని వైసీపీ అంచనా వేసింది, కానీ కుదర్లేదు. దీంతో జైలుకెళ్లి మరీ వంశీని పరామర్శించి వచ్చారు జగన్. బయటకొచ్చిన తర్వాత ఆయన చెప్పిన అందగాడు డైలాగ్ బాగా వైరల్ అయింది. తన సామాజిక వర్గంలో తనకంటే ఎదుగుతున్న వారిని చూస్తే చంద్రబాబుకి కడుపుమంట అని, ఆయన జీర్ణించుకోలేరని చెప్పారు జగన్. చంద్రబాబుకంటే వంశీ, కొడాలి నాని చక్కగా ఉంటారు కాబట్టి వారిని టార్గెట్ చేశారన్నారు. ఆ చక్కగా అనే పదం అక్కడ హైలైట్ అయింది. వంశీ అందగాడే ఎవరూ కాదనరు, అయితే రాజకీయాలకు అందానికి సంబంధం ఏంటి..? పోనీ తనకంటే అందంగా ఉన్నాడని వంశీని, కొడాలి నానీని చంద్రబాబు టార్గెట్ చేయడమేంటి..? జగన్ వ్యాఖ్యలు అక్కడ సింక్ కాలేదు, అందుకే నెటిజన్లు కామెంట్లతో కౌంటర్లిచ్చారు.
అక్కడితో ఆ అందగాడు వెర్షన్ అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఆ తర్వాతే వంశీకి అసలు కష్టాలు మొదలయ్యాయి. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ జుట్టుకు రంగు వేసుకునే అవకాశం లేదు. దీంతో మొదట తెల్లగడ్డం బయటపడింది, ఆ తర్వాత తెల్లజుట్టు ఆయన అసలు వయసుని బయటపెట్టింది. దీంతో వైసీపీ అందగాడు ఇలా అయిపోయారేంటి అంటూ టీడీపీ యాక్టివిస్ట్ లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. అనారోగ్యంతో వంశీ ఇబ్బంది పడుతున్నా ఈ కామెంట్లు ఆగలేదు. చివరకు బెయిలొచ్చి ఆయన బయటకొచ్చినా కూడా ఫలితం లేదు. జగన్ ని కలిసేందుకు వచ్చిన వంశీతో ఆయన ఏం మాట్లాడి ఉంటారో ఊహించి మరీ సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్నారు.