Jagan With Leaders: వైసీపీకి మళ్లీ టెన్షన్ మొదలైందా? తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆ పార్టీ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తోందా? ఏ-1గా సిట్ ఎవర్ని పెట్టనుంది? గతరాత్రి కొందరు నేతలు జగన్‌తో ఎందుకు మాట్లాడారు? జరుగుతున్న పరిణామాలు అప్పటి ప్రభుత్వం పెద్దల మెడకు చుట్టుకోనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీకి కాలం కలిసి రాలేదు. ఓ అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వేస్తోంది. కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రభుత్వం వైసీపీపై పెద్దగా ఫోకస్ చేయలేదు. దీంతో ఆ పార్టీ నేతలు తమ తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్ సీనియర్ నేతలపై కన్నేసింది. బెంగుళూరు వేదికగా మంతనాలు జరుపు తున్నారు. పర్వాలేదు పార్టీలో క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో భారీ కుదుపు.
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో మూడు డెయిరీలకు చెందిన నలుగుర్ని సీబీఐ ఆధ్వర్యంలోని స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఏ-1ను ఖాళీగా ఉంది. రాజశేఖరన్‌ను ఏ-2, పోమిల్ జైన్‌ను ఏ-3, బిపిన్ జైన్‌ను ఏ-4 అపూర్వ చావ్దాను ఏ-5గా పేర్కొంది. ఏ-1 ఎవరనేది ఇప్పుడు కొందరు వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది.
ఈ వ్యవహారంపై ఆనాడు టీటీడీలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారులు ఇరుక్కోవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై కొందరు నేతలు జగన్‌తో గతరాత్రి మంతనాలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. నేతలు చెప్పినదంతా క్షుణ్ణంగా విన్నారట మాజీ సీఎం. విచారణ జరుగుతోందని, సరే చూద్దామని అన్నట్లు కొందరి నేతల మాట.
ALSO READ: తిరుమల నెయ్యి కల్తీలో కీలక పరిణామం.. నలుగుర్ని అరెస్టు చేసిన సీబీఐ
సిట్ ఇప్పటికే టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగులను విచారించింది. వారిలో ఆనాటి పెద్దల పేర్లు చెప్పినట్టు వార్తలు లేకపోలేదు. దీంతో అప్పటి అధికారులు, ప్రభుత్వ పెద్దలతో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. సీబీఐ తమను కూడా అరెస్ట్ చేస్తుందా? తప్పించుకునే మార్గాలు లేవా అనేదానిపై వైసీపీకి చెందిన కొందరి నేతలతో మంతనాలు చేసినట్టు సమాచారం.
జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వైసీపీలోని కొందరు పెద్దలు సీబీఐ తమను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానం తలుపు తడతారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్వయంగా సుప్రీంకోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కష్టమేనని అంటున్నారు. ఈ గండం నుంచి బయటపడేదెలా అంటూ తలలు పట్టుకుంటున్నారట కొందరు అధికారులు.
వైసీపీ కార్యదర్శి, అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సిట్ వేసిన రిమాండ్ రిపోర్టు తెప్పించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దాన్ని ఆయన పూర్తి గమనించిన తర్వాత తదుపరి అడుగులు వేయనున్నారట. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఆయన సంప్రదించే అవకాశాలున్నట్లు వైసీపీ నేతల మాట. చాన్నాళ్లు తర్వాత తిరుమల లడ్డూ వ్యవహారంపై బయటకు రావడంతో అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతుందా? ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి? ఇదే చర్చ ఇప్పుడు ఏపీ అంతటా నెలకొంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు హీటెక్కడం ఖాయమని అంటున్నారు.