అది.. ఆడదా? మగదా..?
ఎమ్మెల్యే నా కొడుకులంట..
జగన్ కూడా దాని కొడుకేనా..?
మాజీ మంత్రి రోజాని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఆగ్రహానికి కూడా కారణం ఉందంటున్నారు జనసైనికులు. ఎమ్మెల్యేలను ‘నా కొడుకులు’ అంటూ సంబోధించడం రోజాకు తగదని అంటున్నారు. రోజా వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గీత దాటినట్టేనా..?
తనని బూతులు తిడుతున్నారంటూ కంటతడి పెట్టుకుంటున్న నేతలు కాసేపటి తర్వాత అన్నీ మరచిపోయి అవే బూతులు వల్లె వేయడం ఏపీ రాజకీయాల్లో తరచూ కనపడుతున్న విశేషం. ఈ బూతు విమర్శలలో నిన్నటి నిందితులే నేటి బాధితులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బూతు పురాణం ఘోరంగా జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నేతలు మళ్లీ ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ని టార్గెట్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వైరల్ అయ్యాయి. అయితే రోజా తనని తాను బాధితురాలిగా చెబుతూ మీడియా ముందు కంటతడి పెట్టడం ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్. మార్ఫింగ్ ఫొటోలు, బూతు మాటలతో తనని వేధిస్తున్నారని చెబుతున్నారామె.
టీడీపీ కౌంటర్..
రోజా వ్యాఖ్యలకు టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. గతంలో రోజా మాటల్ని రివర్స్ లో ప్రయోగించింది. విమర్శలకు భయపడి ఏడ్చే నాయకులకు అప్పట్లో రోజా ఇచ్చిన కౌంటర్ ని ఇప్పుడు ఆమెకే అప్పజెప్పారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ ట్రోల్ చేశారు. రోజా కూడా తగ్గేది లేదన్నారు. తాజాగా ఆమె మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గాలికి గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలంటూ వివాదాన్ని తారాస్థాయికి చేర్చారు రోజా. ఆమె టార్గెట్ నగరి ఎమ్మెల్యేనే కావొచ్చు, కానీ ఏపీలోని అందరు ఎమ్మెల్యేలను ఆమె ఒకే గాటన కట్టి ఈ విమర్శ చేశారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారు. ఎమ్మెల్యేల పుట్టుకపై అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఓ అడుగు ముందుకేసి రోజాకి మరింత ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యే నా కొడుకులు అంటూ రోజా అనడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. ఆమె అనడం కరెక్ట్ అయితే, ఆమెపై తమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్టేనంటున్నారు. రోజాకు అదే స్థాయిలో బదులిచ్చాం కానీ, తామేమీ ఉద్దేశపూర్వకంగా ఆమెను టార్గెట్ చేయలేదంటున్నారు జనసైనికులు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఎన్నికల తర్వాత కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం మరోసారి బూతులతో వేడెక్కింది. ఏ పార్టీ నాయకులైనా ఆ మాటల్ని అలవోకగా వల్లె వేస్తున్నారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు బాధితులో చెప్పలేని పరిస్థితి. తనని తిడుతున్నారని చెప్పి కన్నీరు కారుస్తున్న నేతలే, అంతకంటే మరింత దారుణంగా అవతలివారిని తిట్టిపోస్తున్నారు.