బోయింగ్ విమానాలు ఏ సైజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా వాటికి భద్రత కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని విమానాశ్రయాల్లోనే నిలుపుతారు కాబట్టి.. సిబ్బంది మినహా మరెవ్వరు దాని దరిదాపుల్లోకి వెళ్లలేరు. కానీ, 2003లో ఓ చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఇద్దరు వ్యక్తులు విమానాశ్రయంలో ఉన్న బోయింగ్ 727 విమానాన్ని ఎత్తుకుపోయారు. అది ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఏంటీ.. నిజమా? బోయింగ్ విమానాన్ని ఎలా ఎత్తుకెళ్లగలరు? అసలు అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అది ఇప్పటికీ మిస్టరీనే. కానీ, విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ వివరాలు మీ కోసం.
అది ఆఫ్రికాలోని అంగోలాలోని క్వాట్రో డె ఫెవేరిరో విమానాశ్రయం. అక్కడ ఉంచిన ఒక పాత బోయింగ్ 727 విమానాన్ని కార్గో సేవల కోసం సిద్ధం చేసి ఉంచారు. అయితే, దాని యజమాని ఆ విమానాన్ని తీసుకోవడంలో ఆలస్యం చేశాడు. దీంతో దాన్ని ఎక్కడికి కదల్చకుండా విమానాశ్రయంలోనే ఉంచేశారు. అలా ఏడాది పాటు ఆ విమానాన్ని బయటకు తియ్యలేదు. కానీ.. మే 25, 2003న ఆ విమానం దానికదే కదిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా గాల్లోకి ఎగిరింది. అంతే.. ఆ దెబ్బకు విమానాశ్రయ సిబ్బంది షాకయ్యారు. ఒక్క క్షణం ఏం జరిగిందో తెలీదు. అది అట్లాంటిక్ సముద్రం మీదుగా ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
ఎవరు ఎత్తుకుపోయారు?
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏవియేషన్ డిపార్ట్‌మెంట్.. ఆ విమానాన్ని ఎత్తుకుపోయిన వ్యక్తులు ఎవరో తెలుసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆ పని చేసింది అమెరికాకు చెందిన పైలట్, మెకానిక్ బెన్ ఛార్లెస్ పడిల్లా, కాంగోకు చెందిన మరో మెకానిక్ మైకెల్ ముతాంతు అని తెలుసుకున్నారు. వాస్తవానికి బోయింగ్ విమానం నడపాలంటే కనీసం ముగ్గురు నిపుణులు ఉండాలి. అయితే, బెన్.. మైకెల్‌లకు బోయింగ్ వంటి భారీ విమానాన్ని నడిపిన అనుభవమే లేదు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. విమానాన్ని ఎత్తుకుపోయింది వాళ్లేనా అని అధికారులు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. వాళ్లు ఆ టైమ్‌లో మిస్సింగ్‌లో ఉండటం వల్ల.. వాళ్లే అని భావించారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులైతే.. తాము ఒకరిని మాత్రమే చూశామని అన్నారు. కనీసం అక్కడ సీటీటీవీ కెమేరాలు కూడా లేవు. దీంతో విచారణ మరింత క్లిష్టంగా మారింది.
అంత భారీ విమానం ఎత్తుపోవడం అసాధ్యం, కానీ…
బోయింగ్ వంటి భారీ విమానాన్ని ఎత్తుకెళ్లడం అంటే మాటలు కాదు. కానీ, కొన్ని విషయాలు ఆ దొంగలకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. అంగోలా ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ పెద్దగా లేకపోవడం దొంగలకు కలిసి వచ్చింది. అందుకే వారు విమానం వరకు ఈజీగా చేరుకోగలిగారు. అలాగే.. విమానంలో ఉండే ట్రాన్స్‌పోండర్ (ట్రాకింగ్‌కు ఉపయోగించే డివైజ్)ను ఆఫ్ చేశారు. దాని వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆ విమానం ఎక్కడికి వెళ్లింది.. ఎటువైపు వెళ్లిందనేది తెలుసుకోలేకపోయారు. పైగా ఆ విమానంలో ట్యాంక్ నిండుగా ఇంధనం ఉంది. దానివల్ల ఎక్కడ ఆగకుండా 2400 కిమీలు వరకు ప్రయాణించవచ్చు.
మరి ఆ విమానం ఎక్కడికి వెళ్లింది?
విమానాన్ని దొంగిలించారు సరే. దాన్ని ల్యాండ్ చెయ్యాలంటే.. దానికి తగిన ఎయిర్ పోర్ట్ ఉండాలి. ఆయా ఎయిర్ పోర్టుల నుంచి అనుమతి వస్తేనే ల్యాండింగ్ సాధ్యం. కానీ, ఆ విమానం ఏ విమానాశ్రయానికి వెళ్లలేదు. ల్యాండింగ్ రిక్వెస్ట్ చేసిన సమాచారం కూడా లేదు. అదే పెద్ద మిస్టరీగా మారింది. ఎక్కడైనా క్రాష్ ల్యాండ్ అయినా సరే తెలిసిపోయేది. దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. అంత విమానాన్ని ల్యాండ్ చెయ్యడమూ కష్టమే.. అలాగే దాని దాచి పెట్టడం కూడా కష్టమే.
Also Read: జస్ట్ రూ.2లకే షర్ట్.. యువకులు పోటెత్తడంతో షాప్ యజమాని..?
ఎందుకు దొంగిలించారు?
అసలు అర్థంకాని విషయం ఏమిటంటే.. అలాంటి పెద్ద విమానాన్ని దొంగిలించారంటే.. దాని వెనుక పెద్ద కారణం ఉండి ఉండాలి. అది విద్రోహ చర్యల కోసమైనా అయ్యుండాలి. లేదా ప్రభుత్వాన్ని బెదిరించి డబ్బులు దండుకోడానికైనా అయ్యుండాలి. కానీ, ఆ విమానాన్ని అమ్మేయడం అంత ఈజీ కాదు. పైగా దాన్ని సొంతంగా ట్రావెల్ అవసరాలకు వాడాలన్నా సాధ్యం కాదు. ఆ విమానం విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది. దాని విడి భాగాలు అమ్ముకున్నా కొన్ని కోట్లు వస్తాయి. కానీ అలాంటి ఆధారాలేవీ దొరకలేదు. మరి ఆ విమానాన్ని దొంగిలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇప్పుడు బతికున్నారా లేదా అనే ఆధారాలు కూడా లేవు. ఇది చాలా గ్రేట్ థెఫ్ట్ కదా.