Hari Rama Jogayya Letter: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రియాక్ట్ అయ్యారు కాపు నేత హరి రామజోగయ్య. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం లోకి ఒక్కసారి వెళ్దాం.
కాపు రిజర్వేషన్ కోసం గతంలో తాను ఆమరణ దీక్ష చేశాను. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష విరమింప చేశారని గుర్తు చేశారు హరి రామజోగయ్య. కాపు రిజర్వేషన్‌లపై గత టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం ఇవ్వాలన్నది ఆయన కోరిక. గత వైసీపీ హయాంలో కాపు నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డీఎస్సీలో కాపు నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
ఇటు కేంద్రం, అటు ఏపీలో ప్రభుత్వాల ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని, 90 శాతం కాపులు బలపరచడం వల్లే కూటమి ప్రభుత్వం వచ్చిందన్నది ఆయన మాట. ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్లు విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య. కూటమి సర్కార్ వచ్చిన మొదటి నెలలో హరి రామజోగయ్య రిజర్వేషన్లపై ప్రభుత్వానికి లేఖ రాయడం ఇది రెండోసారి.