Kethireddy Venkatarami Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎవరికీ దాచుకోకుండా, సూటిగా స్పందించిన ఆయన తీరుతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హత్య కుట్ర ఆరోపణలు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పెట్రోల్ బాంబులు వేసి చంపేందుకు కుట్ర జరిగిందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారని అన్నారు. తాడిపత్రిలో పరిస్థితులు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మండి పడ్డారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు
జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఎంతోమందిని చంపించారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతమంది టీడీపీ నేతలను హత్య చేశారో పోలీసు రికార్డుల్లోనే స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు తాడిపత్రిలో 24 మందిని హత్య చేస్తానని బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. హింసా రాజకీయాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పోలీసుల తీరుపై నిలదీత
కొందరు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. వాళ్లు సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. పెట్రోల్ బాంబులు వేసేవారికి డీఎస్పీ, సీఐ రక్షణ కల్పించడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బాంబులు వేస్తే.. ఎదురుగా వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. పోస్టింగుల కోసం అధికారులు ఇంతగా దిగజారాలా అని నిలదీశారు.
చర్యకు ప్రతిచర్య తప్పదు
పోలీసుల మౌనం ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు, పోలీసు అధికారులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని తేల్చి చెప్పారు. తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: తెలంగాణలో బీజేపీ దూకుడు.. వరుసగా 3 రోజులు అగ్రనేతల టూర్లు, షెడ్యూల్ ఇదే!