AP News : అది 2023. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా. ఎల్‌వోసీ వెంట గస్తీ కాస్తోంది ఇండియన్ ఆర్మీ బృందం. పెట్రోలింగ్ టీమ్‌పై సడెన్‌గా ఫైరింగ్ మొదలైంది. ఉగ్రవాదులు రాళ్లు, చెట్ల వెనకాల నక్కి.. మన జవాన్లపై తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. గ్రెనేడ్స్ కూడా విసురుతున్నారు. అయినా, అదరలేదు బెదరలేదు సోల్జర్స్. వెంటనే ఎదురుకాల్పులు స్టార్ట్ చేశారు. గంటల తరబడి కొనసాగింది ఆ ఎన్‌కౌంటర్.
కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ షూటౌట్‌లో ఆర్మీ బృందాన్ని లీడ్ చేసింది మేజర్ రామగోపాలనాయుడు. మన తెలుగువారే. సిక్కోలు సూపర్ సోల్జర్. అతని పోరాట పటిమను మెచ్చి కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్నత పురస్కారం అందుకున్నారు మన మేజర్.
తెలుగు నేలపై మట్టిలో మాణిక్యాలు ఎన్నో. 1995 జూన్ 16న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట అనే మారుమూల గ్రామంలో జన్మించాడు రామగోపాలనాయుడు. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. 2012లో ఎస్‌ఎస్సీ పరీక్ష రాసి.. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. మూడేళ్లు ట్రైనింగ్ తర్వాత.. 2015-16లో డెహ్రాడూన్ అకాడమీలో క్యాడెట్‌గా చేరారు. 2018లో కెప్టెన్‌గా, 2022లో మేజర్‌గా పదోన్నతి పొందారు.
చిన్న ఏజ్‌లోనే మేజర్ స్థాయికి ఎదిగిన ఘనత అతని సొంతం. ప్రస్తుతం 56 రాష్ట్రీయ రైఫిల్స్‌లో మేజర్ హోదాలో ఉన్న రామగోపాలనాయుడుకి.. కీర్తి చక్ర అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణం.